రామగుండం: తిరుపతి – కరీంనగర్ మధ్య నడిచే బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12761) వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతీ బుధ, శనివారాల్లో తిరుపతి నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఇకనుంచి 7.50గంటలకేల బయలుదేరనుందని, అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని వివరించారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.
తీర్థ యాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీ
విద్యానగర్(కరీంనగర్): బోనాల పండుగా సందర్భంగా హైదరాబాద్‌లోని ఆలయాల దర్శనం కోసం ఈనెల 9 ఆదివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీ లగ్జరీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ కరీంనగర్–1 డిపో మేనేజర్ ఐ. విజయమాధురి తెలిపారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ బస్సు సర్వీసు బయలుదేరి నిమిషాంబిక టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, జగన్నాథ టెంపుల్, చిలుకూరు బాలజీ టెంపుల్ సందర్శన అనంతరం అదే రోజు రాత్రి కరీంనగర్ చేరుతుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ.975 టికెట్ ఉంటుందని వివరించారు. వివరాలకు 73828 49352, 9959225920 ఫోన్ నెంబర్లలో సందప్రదిచాలని సూచించారు.
మహిళపై సామూహిక లైంగిక దాడి
జగిత్యాలక్రైం/మల్యాల: మహిళ తన సన్నిహితుడితో ఉన్న సమయంలో వీడియో తీసి, బెదిరించి ఇద్దరు సామూహిక లైంగికదాడికి పాల్పడగా, వీరికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఎస్సై సందీప్‌తో కలిసి సీఐ రాజ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఈనెల 3న ఓ మహిళ నూకపల్లి డబుల్ బెడ్‌రూం కాలనీలో తనకు పరిచయం ఉన్న వారి ఇంటికి తన సన్నిహితుడితో వెళ్లింది. సన్నిహితుడితో ఉన్న సమయంలో రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్, గుర్రం శ్రీకాంత్ వీడియో తీసి సామూహిక లైంగిక దాడి చేశారు. వీరికి దరూర్‌కు చెందిన మారవేని మల్లేశ్, రాజారం గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య సహకరించారు. వీడియో మరికొందరికి పంపారు. దీంతో బాధితురాలు ఈ నెల 6న మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి ఇన్నోవా వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితులు నరేశ్‌పై 13 కేసులు, గుర్రం శ్రీకాంత్‌పై 9, మారవేని మల్లేశ్‌పై 2, గుర్రం అంజయ్యపై 1 కేసులు నమోదు కాగా, రౌడీషీట్ కూడా నమోదయినట్లు సీఐ తెలిపారు.
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
బోయినపల్లి(చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులతో బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన బొటుకు మహేశ్(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎన్.రమాకాంత్ తెలిపిన వివరాలు. మహేశ్ కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. మహేశ్ తండ్రి నందయ్య గతంలో మృతిచెందాడు. కొద్ది నెలులుగా అప్పులు ఎక్కువ అయ్యాయి. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక తన ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్‌కు భార్య నవ్య, ఇద్దరు కుమారులు లోకేశ్(6), అశ్విత్(4) ఉన్నారు. మృతుడి తల్లి బొటుకు లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
వేములవాడరూరల్: వేములవాడలో జగిత్యాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మూడో వార్డులో డ్రైనేజీ సమస్యకు మున్సిపల్ సిబ్బంది పరి ష్కారం చూపారు. ఇటీవల ఈ ప్రాంతంలోకి వచ్చిన ప్రభుత్వ హాస్టల్ నుంచి వచ్చే వ్యర్థం నీటితో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై స్థానిక మహిళలు గురువారం నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు శుక్ర వారం గుంతను తవ్వి మరో మార్గం ద్వారా మురికినీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
పెద్దపల్లి: ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో ఈనెల 6న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్థానికులు పట్టుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఫిర్యాదు చేశారు.


