ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ రోగిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తున్న 108 వాహనం రోడ్డుపైనే మొరాయించింది. ఎంతకీ కదలకపోవడంతో రోగి బంధువులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మరో వాహనాన్ని తెప్పించి రోగిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్‌తండాకు చెందిన భూక్య జెమిలి(85) ఇంట్లో శుక్రవారం ఉదయం జారిపడడంతో కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వీర్నపల్లికి చెందిన 108 వాహనం లక్ష్మీపూర్‌తండాకు వెళ్లి జెమిలిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వాహనం హఠాత్తుగా ఆగిపోయింది. 108 సిబ్బంది ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో రోగి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలోనే గంభీరావుపేటకు చెందిన 108 వాహన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి జెమిలిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆందోళన చెందిన రోగి బంధువులు
మరో వాహనం కోసం నిరీక్షణ


