గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరువాగుపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పనుల జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మానేరు నీటిలో నిల్చున్నారు. వారు మాట్లాడుతూ ఏటా వర్షాకాలంలో మానేరు ఉధృతికి మట్టిరోడ్డు కొట్టుకుపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేశ్, నాయకులు పత్తి స్వామి, బోయన్నగారి శ్రీనివాస్, దేవయ్య, దేవేందర్‌యాదవ్, సర్వోత్తం, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి/ఇల్లంతకుంట: మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి శుక్రవారం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి వరదకాలువ ద్వారా 12,600, మానేరు, మూలవాగుల నుంచి 916 క్యూసెక్కుల మేర వరద ఇన్‌ఫ్లోగా వస్తోంది. మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 19.178 టీఎంసీలకు చేరింది.
రైతుల హర్షం
మిడ్‌మానేరు గేట్లు ఎత్తడంతో మానేరువాగు పరివాహక గ్రామాలైన పొత్తూరు, కందికట్కూర్, నర్సక్కపేట, జవారిపేట రైతులు హర్షం వ్యక్తం చేశారు.
బురదరోడ్డుపై నాట్లు వేసి నిరసన
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండల కేంద్రంలో బురదమయమైన రహదారిపై బీజేపీ నాయకులు నాట్లు వేసి శుక్రవారం నిరసన తెలిపారు. ముస్తాబాద్, దుబ్బాక మార్గంలో కిలోమీటరు దూరం పూర్తిగా గుంతలమయమైందన్నారు. ఈ బురదరోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు జంకుతున్నారన్నారు. నిరసనలో బీజేపీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్, నాయకులు మెరుగు అంజాగౌడ్, మీస సంజీవ్, గోపికృష్ణ, మహేశ్వరీ, మహేందర్, తిరుపతి, మహేశ్, ప్రశాంత్, కార్తీక్‌రెడ్డి, వెంకన్న, దీటి సత్యం, అనిల్, వేణు, హరీశ్, నవీన్, వినయ్, ఆకాశ్, సాయి, నర్సింలు తదితరులున్నారు.
టీజీవో జిల్లా అధ్యక్షుడిగా జబీ
సిరిసిల్ల అర్బన్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ జబీ, కార్యదర్శిగా బి.సాగర్‌ను శుక్రవారం ఎన్నుకున్నారు. బదిలీపై వెళ్లిన జిల్లా మాజీ అధ్యక్షుడు సమర్‌సేన్‌ను సంఘం సభ్యులు సన్మానించారు. రసూల్, చంద్రకళ, అనిల్, సాయికిరణ్, రమాదేవి, నాగరాజు, మారుతిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారంలోని 120 ఎంఎల్‌డీ నీటిశుద్ధి కేంద్రంలో సాధారణ నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రీడ్ ఈఈ ముజాహిద్ అన్వర్ తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందన్నరు. సంబంధిత గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.


