● పకడ్బందీగా నిర్వహించాలి ● 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: మండల స్థాయిలో ప్రభుత్వ పనిదినాల్లో ప్రజావాణి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి శుక్రవారం సమీక్షించారు. ప్రజావాణికి ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. జిల్లాలోని జలాశయాల, చెరువులు, కుంటలు, వాగులను పర్యవేక్షించాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. చేయూత పెన్షన్లను అర్హులకు అందించాలన్నారు.
ప్రతీ పనికి గడువు విధించాలి
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను గడువు విధించి.. నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీటీఏడీఏ అధికారులతో సమీక్షించారు. కార్మికుల సంఖ్యను పెంచి, పనులు వేగంగా పూర్తి చేయించాలన్నారు. గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ, టాయిలెట్ల నిర్మాణం, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ, ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలన్నారు. సిరిసిల్లలో కోర్టు భవనాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
15న సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్‌కార్డులు
ఈనెల 15న సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్వో గొట్టె జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, ఆలయ ఈఈ రాజేశ్, ఎన్పీడీసీఎల్ ఈఈ వేణుమాధవ్, కమిషనర్ లోకేశ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి పాల్గొన్నారు.


