చేనేత.. ఎదురీత ! | - | Sakshi
Sakshi News home page

చేనేత.. ఎదురీత !

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

పోగు వదిలిపెట్టను సబ్సిడీపై పవర్‌లూమ్స్‌ అందించాలి

సిరిసిల్ల: ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేతరంగం కాలానికి ఎదురీదుతోంది. వస్త్రోత్పత్తిలో వస్తున్న టెక్నాలజీతో చేనేతమగ్గాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరమగ్గాల రాకతో వస్త్ర ఉత్పత్తిలో వేగం.. నాణ్యత.. నవ్యత రావడంతో చేనేత మగ్గాల నుంచి మరమగ్గాల వైపు నేతన్నలు మారుతున్నారు. ప్రస్తుతం చేనేతరంగంలో వయోవృద్ధులు మాత్రమే కొనసాగుతున్నారు. పవర్‌లూమ్‌(మరమగ్గాల) రంగం ఆటుపోట్ల మధ్య తలెత్తుకొని జీవించేందుకు ఆరాటపడుతోంది. చేనేతమగ్గాలపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన ఘనత సిరిసిల్ల నేతకార్మికులది. అయితే చేనేతలో అరకొర కూలితో చివరితరం నెట్టుకొస్తోంది. ఆర్థిక సంక్షోభంలోనూ శ్రమిస్తున్న నేతన్నలపై జాతీయ చేనేత దినోత్సవం

సందర్భంగా ప్రత్యేక కథనం.

అరకొర కూలి.. కడుపులు ఖాళీ ● ఆటుపోట్ల మధ్య వస్త్రపరిశ్రమ ● పవర్‌లూమ్స్‌ రాకతో మూలకుపడుతున్న మగ్గాలు ● నేడు జాతీయ చేనేత దినోత్సవం

వందేళ్లు దాటిన ఘన చరిత్ర

1905లో స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ చేనేతరంగంలో విప్లవం మొదలైంది. కలకత్తా టౌన్‌హాల్‌లో అదే సంవత్సరం ఆగస్టు 7న నిర్వహించిన సమావేశంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేతరంగానికి గుర్తింపునిస్తూ 2012 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ నేతకార్మికులకు అవార్డులు అందిస్తున్నారు.

సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం

దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి చేనేత కార్మికుని కాంస్య విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. మగ్గం, అడ్డం పోగుల ధారంతో బట్టను నేసే జోట(నాడె), వస్త్రపరిశ్రమలోని అనుబంధ రంగాల చిత్రాలను ఆవిష్కరిస్తూ సిరిసిల్లలోని కలెక్టరేట్‌ కూడలిని తీర్చిదిద్దారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 28 వేల వరకు ఉన్నాయి. వీటిపై పాలిస్టర్‌ వస్త్రం, 4 వేల మగ్గాలపై కాటన్‌ వస్త్రోత్పత్తి సాగుతోంది. నిత్యం 25 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సిరిసిల్లలో ఉన్న 175 చేనేత మగ్గాలపై 58 మంది వృద్ధులు పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి టెక్స్‌టైల్‌ పార్క్‌ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. జాతీయ జెండాలను గతేడాది 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా సరఫరా కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ విద్యా మిషన్‌, సర్వశిక్ష అభియాన్‌, ఎస్సీ, బీస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ శాఖలకు అవసరమైన యూనిఫామ్‌ వస్త్రం ఆర్డర్లను ఇక్కడి నేతన్నలకు ఇస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పక్కనపెట్టి ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు ఇచ్చింది. అపెరల్‌ పార్క్‌లో టెక్స్‌పోర్ట్‌, గోకుల్‌దాస్‌ గార్మెంట్‌ యూనిట్లలో రెండు వేలకు పైగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడి నుంచి అమెరికాకు రెడీమేడ్‌ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి.

బీమా ఓ వరం

నేతన్నలకు రైతుల తరహాలో రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించారు. 2021 జూలై 4న సిరిసిల్ల వేదికగా ఈ పథకాన్ని ప్రకటించారు. 18–59 ఏళ్ల మధ్య వయసు గల నేతకార్మికులకు అమలు చేస్తున్నారు. బీమా వయసును 70 ఏళ్ల వరకు పొడిగించాలని నేతన్నలు కోరుతున్నారు. బీమాలో చేరిన నేతన్నలు ఏ కారణంగా మరణించినా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఎల్‌ఐసీ ద్వారా అందుతుంది. కార్మికులకు 10 శాతం యారన్‌ సబ్సిడీ, త్రిఫ్ట్‌ పొదుపు పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి.

ఇవి చేస్తే మేలు

వస్త్రానికి మార్కెట్‌ వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. వస్త్రోత్పత్తి వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడంతో కార్మికులు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వపరంగా ఆజమాయిషి ఉండేలా తీర్చిదిద్దాలి. నేతకార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి. పేదరికమే అర్హతగా అంత్యోదయ కార్డులు, ఆర్థిక చేకూర్పు, మహిళా సంక్షేమ పథకాల అమలు చేయాలి. నేతకార్మికులకు పీఎఫ్‌ సౌకర్యం, త్రిఫ్ట్‌ పథకంలో అందరినీ చేర్పించాలి. గుర్తింపుకార్డులు ఇచ్చి ఆరోగ్య సంరక్షణ పథకాలు అమలు చేయాలి.

నేడు ప్రత్యేక కార్యక్రమాలు

సిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాకులు శ్రీరాం సంతోష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పాతబస్టాండ్‌ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాల వేసి, నేతకార్మికులతో కలిసి చేనేత వాక్‌ నిర్వహిస్తామన్నారు. ఇందిరా నగర్‌లోని వ్యవసాయశాఖ గోదాములో 10.30 గంటలకు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

కాల్వశ్రీరాంపూర్‌: నా ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు పోగు వదిలిపెట్టను. చేనేత వస్త్రాలు నేస్తూనే ఉంటా. ప్రభుత్వం చేనేత కార్మికులను, మా కుటుంబాలను ఆదుకోవాలి. మా పిల్లలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలి.

– గోలి రమణయ్య, చేనేత కార్మికుడు,

కాల్వశ్రీరాంపూర్‌

కాల్వశ్రీరాంపూర్‌: చేనేత కార్మికుల పిల్లలకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై పవర్‌లూమ్‌ యంత్రాలు అందించాలి. వస్త్రోత్పత్తిలో శిక్షణ ఇచ్చి, బట్టను మార్కెటింగ్‌ చేసుకునేందుకు సబ్సిడీపై మోపెడ్స్‌ అందజేయాలి. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమకు ఆదరణ ఉండేది. మళ్లీ ఆ రోజులు రావాలి.

– గోలి శ్రీకాంత్‌, కాల్వశ్రీరాంపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement