● గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యం తాగొద్దని కుటుంబసభ్యులు చెప్పడంతో మనస్థాపం చెందిన వ్యక్తి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తంగళ్లపల్లి మండలంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన అట్టె మల్లేశం(55) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లేశం గత నెల 30వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగాడు. ఈవిషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి పెద్ద కుమారుడు అట్టె చంద్రశేఖర్ ఫిర్యాదుతో ఎస్సై ఉపేంద్రచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని శ్రీగాథ శివారులో గురువారం నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలానికి చెందిన తోట నర్సింలు అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుకను తరలిస్తున్నట్లు తెలిపారు. అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కొలనూర్ శివారులోని రెండు రైస్‌మిల్లుల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కొలనూర్‌కు చెందిన లక్ష్మీగణపతి, అన్నాఫి రైస్‌మిల్లులు ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి సీఎమ్మార్ ఇవ్వడం లేదని పౌరసరఫరాల డీఎం గోపాల్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు మల్లేశం, అన్వర్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సిరిసిల్లటౌన్: ప్రతిష్టాత్మకమైన సిరిసిల్ల చేనేత వస్త్రవ్యాపార సంఘానికి ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ ఆఫీసర్ మామిడాల భూపతి విడుదల చేశారు. నామినేషన్లను శనివారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు స్వీకరించి అదే రోజు సాయంత్రం 5 గంటల్లోపు పరిశీలిస్తామన్నారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గుర్తులు కేటాయిస్తామని తెలి పారు. ఈనెల 12న ఏజెంట్ల నియామకం చే పట్టి, 13న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తున్నట్లు వివరించారు.
వేములవాడరూరల్: వేములవాడ నుంచి జగిత్యాలకు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన ఉన్న హాస్టల్ నుంచి వస్తున్న మురికినీటి దుర్గంధంతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని ఆ ప్రాంత మహిళలు గురువారం రోడ్డెక్కారు. పట్టణంలోని మూడో వార్డులో ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల నూతనంగా ఓ భవనంలోకి ప్రభుత్వ హాస్టల్ వచ్చింది. భవనం నుంచి మురికినీటిని రోడ్డు పక్కన ప్రత్యేక కాలువ ద్వారా వదిలిపెట్టడంతో దుర్వాసన వస్తోందని మహిళలు పేర్కొన్నారు. మహిళల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
వెంకట్రావుపల్లిలో మరో చోరీ
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని వెంకట్రావుపల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు గురువారం ఇంటికి చేరుకోగా చోరీ విషయం బయటపడింది. వరుస చోరీలతో వెంకట్రావుపల్లి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి రెండిళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అలాగే తాళం వేసి ఉన్న మరొకరు రాజు ఇంట్లో కూడా దొంగలుపడ్డారు. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. వారింట్లోకి చొరబడిన దొంగలు రూ.5వేల నగదు, 10 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ఎస్సై జ్యోతి గ్రామంలో విచారణ చేపట్టారు.
కంచర్లకు రాత్రి బస్సు వేయండి
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్లకు రాత్రివేళల్లో బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ సామర్ల దేవరాజు కోరారు. గురువారం సిరిసిల్ల డిపో మేనేజర్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు.


