భూ బాధితుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భూ బాధితుడి ఆత్మహత్యాయత్నం

Aug 7 2026 3:53 AM | Updated on Aug 7 2026 3:53 AM

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్లలో భూవిక్రయాల్లో జరుగుతున్న మోసానికి ఇదో నిదర్శనం. భూవిక్రయదారుడు గతంలో విక్రయించిన భూమిని రెండోసారి మరొకరికి విక్రయించిన మోసం ఆలస్యంగా వెలుగుచూసింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు గాజుల నవీన్‌ తెలిపిన వివరాలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన గాజుల నవీన్‌ టెంట్‌ నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి తన భార్య పేరున ఉన్న భూమిని నవీన్‌కు విక్రయించాడు. స్థానిక భవానినగర్‌లోని ఆరున్నర గుంటలకు రూ.34లక్షలకు బేరం కుదిరింది. ఇరువర్గాలు రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వెళ్లి పత్రాలను నవీన్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయితే ఏడాది క్రితం తాను కొన్న ఆరున్నర గుంటల భూమికి కంచె వేయడానికి నవీన్‌ వెళ్లగా హుజూరాబాద్‌కు చెందిన వ్యక్తి ఆ భూమిలో తనకు 2012లోనే స్థలం యజమాని మూడు గుంటలు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చినట్లు పత్రాలు చూపించాడు. దీంతో తాను మోసపోయినట్లు గమనించిన నవీన్‌ స్థలం విక్రేత వద్దకు వెళ్లి తనకు రావాల్సిన మూడు గుంటల డబ్బులు తిరిగివ్వాలని కోరాడు. అతను ససేమిరా అంటున్నాడు. దీంతో రెండు నెలల క్రితం భూవిక్రేత ఇంటికి కుటుంబ సభ్యులతో సహా నిలదీయడానికి వెళ్లగా నవీన్‌పై దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. ఈవిషయమై పోలీస్టేషన్‌లో ఫిర్యాదుకు వెళ్లినట్లు తెలిపారు. కానీ స్థలం విక్రేత తరఫున అధికార పార్టీ నేతలు వచ్చి ఎస్సైతో కలిసి తనపైనే ఉల్టా కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.3లక్షలు తీసుకో..

ఏడాదిగా పెద్దమనుషులు పంచాయితీ చేస్తున్నారని తనకు రూ.16లక్షలు రావాల్సి ఉండగా.. రూ.3లక్షలు ఇస్తామంటున్నారని రోదించాడు. ఇలా తనపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. మానసికంగా క్షోభకు గురై బుధవారం రాత్రి ఐదు పారాసిటమాల్‌ మాత్రలు మింగినట్లు బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం నవీన్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement