● పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: పౌరుల గుర్తింపునకు ఉపయోగపడే డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో తప్పులు ఎలా దొర్లుతున్నాయో రవాణాశాఖ అధికారులు వివరించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం మాట్లాడారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకున్న వహీద్ హుస్సేన్ సంతకానికి బదులు బి.సత్తయ్య అని ఎలా ముద్రించారని ప్రశ్నించారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీలో అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. ఈవిషయమై డీటీవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. లైసెన్స్ హోల్డర్ సంతకం తప్పుగా రావడంలో తమ సిబ్బంది ప్రమేయం ఉండదన్నారు. దరఖాస్తుదారులే ఆన్‌లైన్ పోర్టల్‌లో నేరుగా వివరాలు, సంతకాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లను తప్పుగా స్కానింగ్ చేయడంతోనే సంతకం వేరే వ్యక్తిది వచ్చి ఉంటుందని తెలిపారు. మరోసారి ఆన్‌లైన్‌లో సరైన వివరాలు పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.


