శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సమీక్షించారు. సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్‌ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటి వరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్‌ స్పష్టం చేశారు.

పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలు

చందుర్తి(వేములవాడ): పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కల్లెడ శైలేశ్‌, కల్లెడ లక్ష్మణ్‌ రెండెకరాల్లో మల్బరీ సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టగా మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. మల్బరీ తోట సాగు, షెడ్ల నిర్మాణం, ఇతర పరికరాల కోసం సెరికల్చర్‌ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీ అందిస్తుందన్నారు. పట్టు పురుగుల శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ముందుకు వవచ్చి సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యావన శాఖ అధికారి శరత్‌బాబు, పట్టుపరుగుల శాఖ అధికారి జగన్‌, తహసీల్దార్‌ భూపతి, సర్పంచ్‌ మందాల శారద తదితరులు పాల్గొన్నారు.

ఉచిత శిక్షణకు దరఖాస్తులు

సిరిసిల్ల: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌–2027 కోసం ఉచిత దీర్ఘకాలిక శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎం.సౌజన్య మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 7లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఆమె కోరారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.5వేలు ఉపకార వేతనం, రూ.5వేల పుస్తక నిధి, నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారని వివరించారు. జిల్లాలోని బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.

సైబర్‌ నేరాల నియంత్రణపై చైతన్యం తేవాలి

రుద్రంగి(వేములవాడ): గ్రామీణ ప్రాంత ప్రజలు, యువతకు సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే సూచించారు. మంగళవారం రుద్రంగి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామాల్లో రాత్రి వేళ పెట్రోలింగ్‌ మరింత పటిష్టం చేయాలని, రౌడీషీటర్లు, గంజాయి తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్‌, ఎస్సై మోతీరాం, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement