ముస్తాబాద్‌లో రాజుకున్న కలర్ రాజకీయం
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మేజర్ పంచాయతీకి రాజకీయరంగు అంటుకుంది. పంచాయతీ భవనానికి వేసే కలర్ విషయంలో రాజుకున్న వివాదం మూడు రాజకీయపార్టీల ఆందోళనకు దారితీసింది. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ కార్యాలయం భవనానికి కాంగ్రెస్ నాయకులు సోమవారం జాతీయ జెండా రంగులు వేసేందుకు ప్రయత్నించారు. భవనానికి ఉన్న నాలుగు స్తంభాలకు మూడు రంగులతోపాటు అశోకచక్రం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నాయకులకు సర్ది చెప్పారు. అప్పుడే అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనానికి గులాబీరంగు ఉండేదని ఇప్పుడు దానిని తెలుపురంగులోకి ఎలా మార్చారంటూ నిరసనకు దిగారు. గులాబీ రంగు సైతం వేయాలంటూ ఆ పార్టీ నాయకులు సంతోష్‌రావు, భరత్ బైఠాయించారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. అప్పుడే బీజేపీ మండల అధ్యక్షుడు క్రాంతి ఇతర నాయకులు గ్రామపంచాయతీ వద్దకు చేరుకుని గతంలో ఉన్న గులాబీరంగును పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు తొలగించారని, నేమ్‌ప్లేట్‌కు మాత్రం కనిపించేలా మరో కలర్ వేశారన్నారు. భవనానికి జాతీయ జెండా కలర్ వేస్తే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు, ఉపసర్పంచ్ విజయ్, మహేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూడు పార్టీల నేతల ఆందోళనతో మండల కేంద్రం దద్దరిల్లింది. ఎస్సై జ్యోతి, పోలీస్ బలగాలతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు చేపట్టారు. ఎంపీడీవో లచ్చాలు సూచనతో తెలుపురంగు వేసేలా మూడు పార్టీల నాయకులతో పోలీసులు చర్చలు జరిపారు.


