● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: బాధితులకు పోలీసులు చట్టపరిధిలో అండగా నిలవాలని, సమస్యతో వచ్చిన వారికి పరిష్కారం చూపాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 38 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల ఫిర్యాదులపై ఆ యా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్లు చేసి చట్టపరంగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
వర్షం..హర్షం
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా సోమవారం వర్షం కురిసింది. బోయినపల్లిలో అత్యధికంగా 39.6 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 2.3, చందుర్తిలో 4.0, వేములవాడ రూరల్‌లో 1.1, వేములవాడలో 8.8, సిరిసిల్లలో 3.3, కోనరావుపేటలో 2.4, వీర్నపల్లిలో 4.9, ఎల్లారెడ్డిపేటలో 1.4, గంభీరావుపేటలో 11.9, ము స్తాబాద్‌లో 2.2, తంగళ్లపల్లిలో 0.9, ఇల్లంతకుంటలో 0.6 మిల్లీమీటర్లు పడింది. సిరిసిల్ల, ఇల్లంతకుంట మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది.
జలాశయాల్లో నీటి మట్టం
మధ్యమానేరులో 13.525 టీఎంసీ నీరు నిల్వ ఉండగా.. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులో 1.048 టీఎంసీల నీరుంది. పాల్వంచ, కూడెల్లివాగుల ద్వారా కొద్దిపాటి వరద జలాశయంలోకి వస్తోంది. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ జలాశయంలో 1.466 టీఎంసీల నీరుంది.


