తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకు తొందరపడి వరినాట్లు వేసి రైతులు నష్టపోవద్దని, తక్కువ నీటితో ఎక్కు వ ఆదాయాన్ని ఇచ్చే ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం కోరారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో శనివారం ప్రకృతి వ్యవసాయపద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్న రైతులు సందిరి శ్రీనివాస్, దానవేణి పెద్దయ్యల తో టలు పరిశీలించారు. ఎకరం వరికి అయ్యే నీటితో మూడెకరాల్లో ఆరుతడి పంటలు లేదా కూరగాయలు పండించవచ్చన్నారు. ప్రతీ వర్షపు బొట్టునూ భూమిలోనే ఇంకించేందుకు ఫామ్‌పాండ్ లేదా బోర్‌వెల్ రీచార్జ్ ఫిట్ తవ్వుకోవాలని సూచించారు. ఎంఏవో సంజీవ్, ఏఈవో గంగా, మండెపల్లి సర్పంచ్ గాదగోని సాగర్ పాల్గొన్నారు.
నైపుణ్యాలతోనే ఆపద నివారణ
సిరిసిల్ల అర్బన్: డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యాలతోనే ఆపదలను నివారించవచ్చని 17వ బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ పేర్కొన్నారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శిక్షణ శనివారం ముగిసింది. కమాండెంట్ ఛటర్జీ మాట్లాడుతూ విపత్తులు, వరదలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది కీలకమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేయాలని సూచించారు. శిక్షణను పూర్తి చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 31 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అసిస్టెంట్ కమాండెంట్స్ సంజీవరెడ్డి, ఎస్డీఆర్‌ఎఫ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన డిజిటల్ విద్యనందించాలి
సిరిసిల్లటౌన్: కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యను బోధించాలని జిల్లా విద్యాధికారి, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి మొండయ్య సూచించారు. కస్తూ ర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్)లో భాగంగా ల్యాప్‌టాప్స్ అందించి మాట్లాడారు. వైఐఐఏఈ అమలుకు రాష్ట్ర కార్యాలయం ప్రభుత్వం పది ల్యాప్‌టాప్స్ కే టాయించినట్లు తెలిపారు. వైఐఐఏఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన–అభ్యాస ప్రక్రియలో సమర్థంగా వినియోగించేందుకు ఈ ల్యాప్‌టాప్స్ ఎంతో దోహదపడతాయన్నారు.
ఫీజుల వివరాలు ప్రదర్శించాలి
వేములవాడ: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. వేములవాడలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లను శనివారం తనిఖీ చేశారు. బయో మెడికల్ వేస్ట్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్స్, వైద్యుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమన్నారు. స్కానింగ్ వివరాలను ఏరోజుకారోజు ఆన్‌లైన్ చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు డయాగ్నోస్టిక్ సెంటర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సెక్షన్ ఇన్‌చార్జి మహేశ్ ఉన్నారు.
చట్టాల రద్దుకు కేంద్రం కుట్ర
ముస్తాబాద్(సిరిసిల్ల): పోరాడి సాధించుకున్న కార్మిక, కర్షక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తోందని సీడబ్ల్యూఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస భిక్షపతి ఆరోపించారు. జైల్‌భరో కార్యక్రమ పోస్టర్లను శనివారం ముస్తాబాద్‌లో ఆవిష్కరించారు. సీపీఎం మండల కన్వీనర్ కట్కూరి నరేశ్, ఎడ్ల రమేశ్, యాదగిరి, బాలయ్య, ప్రవీణ్, రాజయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.


