ఎగువ మానేరులోకి వస్తున్న పాల్వంచ, కూడెల్లి వాగులు
మధ్యమానేరులోకి కొనసాగుతున్న పంపింగ్
సిరిసిల్ల: జిల్లాలో నాలుగో రోజు శుక్రవారం వర్షం గెరువిచ్చి అంతలోనే కురిసింది. కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లో సాధారణం కంటే అధికం, ఇల్లంతకుంటలో లోటు, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
రోడ్డెక్కిన మురికినీరు
జిల్లా కేంద్రంలోని నేతన్నచౌక్ వద్ద మురికినీరు రోడ్డుపైకొచ్చింది. సంజీవయ్య విగ్రహం వద్ద వరద పెరగడంతో పోలీసులు బారీకేడ్లు పెట్టారు.
మధ్యమానేరులోకి పంపింగ్
మధ్యమానేరులోకి ఎల్లంపల్లి ద్వారా నీటి పంపింగ్ కొనసాగుతోంది. 17,867 క్యూసెక్కులు వరదకాల్వ ద్వారా వస్తోంది. 27.55 సామర్థ్యం గల మిడ్‌మానేరులో ప్రస్తుతం 9.691 టీఎంసీల నీరుంది. గంభీరావుపేట ఎగువ మానేరులోకి పాల్వంచవాగు, కూడెల్లి వాగు ద్వారా 2,590 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ జలాశయంలో ప్రస్తుతం 1.47 టీఎంసీల నీరుంది.
నిండిన మూలవాగు జలాశయం
కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండి మత్తడి పారుతోంది. దీని ద్వారా నిమ్మపల్లి, వట్టిమల్ల, కొండాపూర్‌లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తుంది. జిల్లాలోని 656 చెరువుల్లోకి కొద్దిగా వరద చేరుతోంది.
కూలిన ఇళ్లు
బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన మల్కూరి శంకరయ్య, వీర్నపల్లి మండలం బంజేరుకు చెందిన పసుల బాబాయి, వీర్నపల్లికి చెందిన పడకాపురం అంజవ్వ ఇళ్లు కూలిపోయాయి.


