కొత్త ఆశలు.. అభివృద్ధి భాసలు
సిరిసిల్ల: కొత్త ఏడాది.. కొంగొత్త ఆశలను మోసుకొచ్చింది. ప్రజలు సైతం నూతన సంవత్సరంలో తమకు కొంతైనా మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. ఈక్రమంలో నూతన సంవత్సరంలో కొత్తగా ఏం చేస్తారని జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేలను బుధవారం ‘సాక్షి’ పలకరించింది. 2026లో అనేక ప్రణాళికలతో.. అభివృద్ధికి బాటలు వేయాలని భావిస్తున్నట్లు వారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. వారు చెప్పిన విశేషాలు.. వారి మాటల్లోనే...
ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రంగా అభివృద్ధి
రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తరణ వేగంగా పూర్తి చేస్తాం. రూ.150కోట్లతో పనులు సాగుతున్నాయి. కార్మిక క్షేత్రం సిరిసిల్ల పట్టణ అభివృద్ధితోపాటు నేతన్నల ఉపాధికి, వస్త్రపరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తాం. నేతన్నలకు యారన్ డిపో ఏర్పాటు చేసి నూలు అందిస్తున్నాం. రైతులకు శాశ్వత ప్రాతిపదికన సాగునీరు అందించే మర్రిపల్లి, లచ్చపేట, కొలనూర్, కలికోట సూరమ్మ రిజర్వాయర్లను పూర్తిచేస్తాం. నిమ్మపల్లి మూలవాగుకు గోదావరి జలాలను మళ్లించే పనులు చేపడతాం. మల్కపేట ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేశాం. మారుపాక శివారులో కాల్వ భూసేకరణకు నిధులు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డిపేట మీదుగా ఎగువమానేరు వరకు గోదావరి జలాలు తరలింపు 9వ ప్యాకేజీలో పూర్తిచేస్తాం. జిల్లాలో 70 ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చి రైతులకు అండగా ఉంటాం. అర్హత గల పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించాం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే


