డయాలసిస్‌ దయనీయం | - | Sakshi
Sakshi News home page

డయాలసిస్‌ దయనీయం

Jan 1 2026 11:03 AM | Updated on Jan 1 2026 11:03 AM

డయాలస

డయాలసిస్‌ దయనీయం

● జిల్లాలో 25 డయాలసిస్‌ బెడ్లు ● 2 వేలకు పైగా కిడ్నీ బాధితులు ● నెలలో పక్షం రోజులు ఆస్పత్రుల చుట్టూ.. ● దూరభారంతో వ్యాధిగ్రస్తుల విలవిల

వీరు ముస్తాబాద్‌కు చెందిన దంపతులు మిడిదొడ్డి శ్రీనివాస్‌–లక్ష్మి దంపతులు. లక్ష్మి రెండేళ్ల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధికి గురైంది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో చేర్పించగా రెండు కిడ్నీలు పాడయ్యాయి. వారంలో రెండు సార్లు డయాలసిస్‌ చేయాల్సిందే. దీంతో ముస్తాబాద్‌ నుంచి కరీంనగర్‌కు తిరగలేక అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాడు. నెలకు రూ.5వేలు అద్దె, మందులకు రూ.13వేలు, ఇంటి ఖర్చు రూ.5వేలు ఖర్చు చేశాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు ఇది భారంగా మారింది. కరీంనగర్‌లో ఉండలేక ఖర్చులు భరించలేక ఆరు నెలల క్రితం ముస్తాబాద్‌కు వచ్చాడు. వీరి ఒక్కాగానొక్క కొడుకు వెంకటేశ్‌ ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కొడుకు చనిపోయాడనే మనోవేదనలో లక్ష్మికి షుగర్‌ వచ్చింది. షుగర్‌ లెవల్‌ పెరిగి మూడు నెలల క్రితం కంటిచూపు కోల్పోవడంతో భార్యకు అన్ని సపర్యాలు చేయాల్సి వస్తుంది. పొరుగున ఉన్న సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి డయాలసిస్‌ చేయిస్తున్నాడు. భర్త పడుతున్న బాధలు చూడలేక తీవ్ర మనోవేదనకు గురవుతుంది. కనీసం ప్రభుత్వం పింఛన్‌ ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటుంది.

● జిల్లాలో 25 డయాలసిస్‌ బెడ్లు ● 2 వేలకు పైగా కిడ్నీ బాధితులు ● నెలలో పక్షం రోజులు ఆస్పత్రుల చుట్టూ.. ● దూరభారంతో వ్యాధిగ్రస్తుల విలవిల

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మారుతున్న జీవన విధానాలు.. ఆహారపు అలవాట్లు.. తాగునీటిలో పలు మార్పులతో కిడ్నీలు పాడవుతున్నాయి. ఇటీవల జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. జిల్లాలో ఏకై క డయాలసిస్‌ సెంటర్‌ సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంది. అక్కడ రోగులకు అనుగుణంగా బెడ్లు లేకపోవడంతో చాలా మంది కరీంనగర్‌, దుబ్బాక పట్టణాలకు వెళ్లి డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఖర్చు తడిసి మోపెడవడంతోపాటు దూరభారంతో ఇబ్బంది పడుతున్నారు.

జిల్లా ఆస్పత్రిలో 20 బెడ్లు

సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలోని 20 డయాలసిస్‌ బెడ్లపై రోజుకు 100 మంది చికిత్స పొందుతున్నారు. గత ప్రభుత్వం చొరవతో సిరిసిల్ల ఆస్పత్రిలో 20 బెడ్లపై డయాలసిస్‌ మిషన్లను ఏర్పాటు చేశారు. వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో ఐదు బెడ్లతో కూడిన డయాలసిస్‌ కేంద్రాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నెలలో 450 మంది కిడ్నీ పేషంట్లకు డయాలసిస్‌ నిర్వహిస్తున్నారు. రోజుకు 20 మందికి నాలుగు షిప్టుల్లో డయాలసిస్‌ నిర్వహిస్తున్నారు. అయితే ఒక పేషంట్‌కు కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక పేషంట్‌ ఆస్పత్రికి రావాలంటే ఆటో లేదా కారు అద్దెకు తీసుకోవాలి. దానికి రూ.2వేల నుంచి రూ.4వేలు అద్దె చెల్లించాల్సిందే. ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా డయాలసిస్‌ నిర్వహిస్తున్నా దూరభారం పేషంట్లకు శాపంగా మారింది.

ప్రత్యామ్నాయం ఆరోగ్యకేంద్రాలు

జిల్లాలోని వీర్నపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట, రుద్రంగి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి రా వా లంటే ప్రత్యేకంగా ఓ వాహనం తీసుకోవాల్సి వ స్తుంది. ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల్లో రద్దీ పెరగడంతో కరీంనగర్‌, సిద్దిపేట, హైదరాబాద్‌ పట్ట ణాలకు వెళ్తున్నారు. రోగి ప్రాణాలు కాపాడుకునేందుకు అత్యవసరంగా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో జిల్లాలో ఉన్న 13 మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం రెండు బెడ్లతోకూడిన డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల్లోని రోగులు కోరుతున్నారు.

ఉద్యోగుల కుటుంబాలకు అందని డయాలసిస్‌

జిల్లా ఆస్పత్రితోపాటు వేములవాడలోని ప్రాంతీయ వైద్యశాలలో ఉద్యోగుల కుటుంబాలకు డయాలసిస్‌ వైద్యం అంద డం లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా వీరికి హెల్త్‌కార్డులు, రీయింబర్స్‌మెంట్‌ ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు డయాలసిస్‌ కోసం కరీంనగర్‌, హైదరాబాద్‌, వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. తాము అంతా దూరం వెళ్లలేమని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చికిత్స అందించి, రీయింబర్స్‌మెంట్‌ తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

డయాలసిస్‌ దయనీయం1
1/1

డయాలసిస్‌ దయనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement