సరదాగా.. సందడిగా కేటీఆర్
● క్రికెట్ విజేతలకు బహుమతులు.. విద్యార్థులకు బ్యాగుల పంపిణీ ● బీఆర్‌ఎస్ శ్రేణులకు ఎన్నికలపై దిశానిర్ధేశం
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె.తారక రామారావు బుధవారం సిరిసిల్లలో సరదాగా క్రికెట్ ఆడి.. విద్యార్థులతో కేక్ కట్ చేసి సందడిగా గడిపారు. తొలుత తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులతో మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై సమీక్షించారు. వార్డుల వారీగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఆరా తీశారు. సిరిసిల్ల మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని, అందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తాను వస్తానని, క్షేత్రస్థాయిలో ప్రతీ ఇంటికి అభ్యర్థులు వెళ్లాలని, ఓటర్లను నిత్యం కలవాలని దిశానిర్ధేశం చేశారు.
కాలేజీ మైదానంలో క్రికెట్ బ్యాటింగ్
సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘కేటీఆర్ కప్–2025’ క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ తిలకించారు. కాసేపు బ్యాటింగ్ చేశారు. విజేతగా నిలిచిన అన్నారం శ్రీనివాస్ ఎలెవన్ జట్టుకు, ద్వితీయస్థానం పొందిన తవక్కళ్ జట్లకు ట్రోఫీలు అందించారు. బెస్ట్‌బౌలర్‌గా వినయ్, బ్యాట్స్‌మెన్‌గా అమ్ములకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు సత్తార్, ఉస్మాన్, గెంట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ విద్యార్థులతో కేక్ కటింగ్
సుందరయ్యనగర్‌లోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులతో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలతో సరదాగా గడిపారు. హాస్టల్‌లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని ఆరా తీశారు. వసతి గృహంలోని విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు తోట ఆగయ్య, న్యాలకొండ అరుణ, జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, మంచె శ్రీనివాస్, దేవరకొండ తిరుపతి, పబ్బతి విజయేందర్‌రెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


