అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందిస్తాం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని, క్రమం తప్పకుండా సదరం శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం డీఆర్‌డీఏ, జిల్లా జనరల్ ఆస్పత్రి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైకల్య నిర్ధారణ పరీక్ష కేంద్రంలో వసతులు కల్పించాలన్నారు. దివ్యాంగుల దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్, డీపీఎం వంగ రవీందర్ పాల్గొన్నారు. అంతకు ముందు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరం శిబిరాలు, యూడీఐడీ కార్డుల జారీపై సమీక్షించారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
సిరిసిల్ల అర్బన్: ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్, పెద్దూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని తనిఖీ చేశారు. ప్రధానంగా షాపుల్లో ప్రస్తుతం రిజిస్టర్, స్టాక్ ఎరువుల నిలువలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని బస్తాల ఎరువులు విక్రయించారో ఆరా తీశారు. ఇప్పటి వరకు విక్రయించిన ఎరువులు, రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, మండల వ్యవసాయాధికారి సందీప్ తదితరులు పాల్గొన్నారు.


