ఇసుక అక్రమ రవాణాపై కొరడా
● టిప్పర్లు, మూడు పికప్ వ్యాన్లు, ట్రాక్టర్, జేసీబీలు సీజ్
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 8 భారీ వాహనాలను సీజ్ చేయడమే కాదు.. ఇసుక స్మగ్లర్లపై కేసులు నమోదు చేశారు. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె, కొండాపూర్ మధ్య మానేరువాగు నుంచి ఇసుక రవాణాపై డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఇసుక స్మగ్లర్లు పారిపోగా మూడు టిప్పర్లు, మూడు పికప్ వాహనాలు, ఒక జేసీబీ, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న రామలక్ష్మణపల్లెకు చెందిన చంద్రమౌళితోపాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. పంట పొలాల్లో డంపు చేసిన ఐదు ట్రిప్పుల ఇసుకను సీజ్ చేశారు. ఎస్సై గణేశ్ ఉన్నారు.


