రెండేళ్లుగా ‘హానీట్రాప్‌’ దందా..!? | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా ‘హానీట్రాప్‌’ దందా..!?

Jan 1 2026 12:00 PM | Updated on Jan 1 2026 12:00 PM

రెండేళ్లుగా ‘హానీట్రాప్‌’ దందా..!?

రెండేళ్లుగా ‘హానీట్రాప్‌’ దందా..!?

ముగ్గురు రిమాండ్‌ – మిగిలిన వారెక్కడ..?

మెట్‌పల్లిరూరల్‌: మూడురోజుల క్రితం మెట్‌పల్లిలో వెలుగుచూసిన హానీట్రాప్‌ దందాలో లెక్కలేని మంది బాధితులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సుమారు రెండేళ్లుగా ఈ ముఠా తమ దందాను కొనసాగించినట్లు సమాచారం. ముఠాలో ముగ్గురిని బుధవారం సాయంత్రం పోలీసులు రిమాండ్‌ చేశారు. మరో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కిన అనంతరం తిరిగివస్తామని చెప్పి జాడలేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నిందితుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరు యాంటిసిపేటరీ బెయిల్‌ తెచ్చుకునే యత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.

రెండేళ్లుగా దందా

మెట్‌పల్లిలో వెలుగుచూసిన హానీట్రాప్‌ దందా సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు సమాచారం. నిందితుని సెల్‌ఫోన్‌లో పదుల సంఖ్యలో వీడియోలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో బాధితుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానీ ట్రాప్‌లో చిక్కుకుపోయిన నిందితులు తమ పరువు ఎక్కడ పోతుందన్న భయంతో ఈ ముఠా అడిగినంత మేర డబ్బులు చెల్లించి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కొంత మంది వ్యాపారులు, రియల్టర్లు, చిన్నాచితక లీడర్లు ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి రావడంతో కొంతమంది బాధితులు పోలీసులను కలిసి తాము సైతం మోసపోయామని చెప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు వేగవంతంగా.. లోతుగా విచారణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితుల సెల్‌ఫోన్లను పూర్తిస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించే యత్నాల్లో ఉన్నారు. నిందితుల్లో ఒకరి సెల్‌పోన్‌లో సుమారు రూ.20 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

హానీ ట్రాప్‌ ముఠాలో నిందితులు బల్మూరి స్వప్న, కోరుట్ల రాజు, దేవ నర్సయ్యను బుధవారం సాయంత్రం పోలీసులు రిమాండ్‌ చేసినట్లు సమాచారం. మొదట పోలీసుల అదుపులో ఉండి తరువాత కనిపించకుండా పోయిన మరో ముగ్గురు నిందితులు ఎక్కడున్నారో జాడ తెలియడం లేదు. మంగళవారం రాత్రి నుంచి ఈ ముగ్గురు నిందితులు యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేసే క్రమంలోనే జాడ లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. వీరి సెల్‌పోన్లు ఠాణాలోనే ఉండటంతో వీరి జాడ తెలియడం సమస్యగా మారినట్లు తెలిసింది. మెట్‌పల్లి పరిసరాల్లో హానీట్రాప్‌ అంశం చర్చనీయాంశంగా మారిన క్రమంలో ఇదివరకు మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని సమాచారం.

బాధితులు ఎందరో..

నిందితుల్లో ముగ్గురు రిమాండ్‌

మరింత లోతుగా విచారణ

జాడలేని మరో ముగ్గురు నిందితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement