ఒంగోలు నియోజకవర్గంలో 10,321 డూప్లికేట్‌ ఓట్లు | - | Sakshi
Sakshi News home page

ఒంగోలు నియోజకవర్గంలో 10,321 డూప్లికేట్‌ ఓట్లు

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 10,321 డూప్లికేట్‌ ఓట్లు నమోదైనట్లు గుర్తించామని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ సర్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు గురువారం ఒంగోలు ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌ఓ) చంద్రశేఖర నాయుడును ఆయన చాంబర్‌లో కలిసి ఫిర్యాదు చేసి వినతిపత్రం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో చుండూరి రవిబాబు మాట్లాడుతూ డూప్లికేట్‌ ఓట్లను సమగ్రంగా పరిశీలించి చట్టప్రకారం తొలగించాలని కోరుతూ ఎన్నికల నమోదు అధికారికి వినతిపత్రం ఇప్పించామన్నారు. విశ్వసనీయ వనరుల నుంచి తాము సేకరించిన అనుమానాస్పద డూప్లికేట్‌ ఓటర్ల జాబితాలను బూత్‌ల వారీగా జత చేసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా వైఎస్సార్‌ సీపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారులకు (బీఎల్‌ఓలు) ఈ జాబితాలను అందించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు స్వీకరించలేదని చెప్పారు. దీంతో పూర్తి వివరాలను నేరుగా ఈఆర్‌ఓ కార్యాలయానికి అందించినట్లు వెల్లడించారు. డూప్లికేట్‌ ఓటర్లను తొలగించకపోతే దొంగ ఓటింగ్‌కు అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, సమగ్రత దెబ్బతింటాయని రవిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన ఓటర్ల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి తగిన విచారణ నిర్వహించి డూప్లికేట్‌ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల అధికారులను కోరారు. డీఆర్‌ఓకు వినతిపత్రం ఇచ్చిన వారిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రకాశం జిల్లా సర్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు పాలడుగు రాజీవ్‌, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ బూత్‌ కన్వీనర్‌ కొల్లం కార్తీక్‌, ప్రకాశం జిల్లా ముదిరాజ్‌ సంఘ అధ్యక్షుడు పులుసు సురేష్‌బాబు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి

చుండూరి రవిబాబు

వైఎస్సార్‌ సీపీ సర్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆధ్వర్యంలో ఆర్డీవోకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement