గిద్దలూరు రూరల్: మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన మండలంలోని గడికోట పంచాయతీ విఠాముసురుపల్లెలో శుక్రవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాశమ్మ అనే మహిళ పొలం వెళ్తున్న సమయంలో పూటుగా మద్యం తాగిన ఎలకా నాయుడు అనే యువకుడు మీ పొలంలోకి ఇక్కడి నుంచి దారి లేదని ఘర్షణ పడి కర్రతో గాయపరిచాడు. దీంతో ఆమె కుడి చెయ్యి విరిగింది. తీవ్రంగా గాయపడిన కాశమ్మను చికిత్స కోసం బంధువులు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కలనూతల, చింతలముడిపి ప్రజలకు ఆర్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా ఎస్‌వీకేపీ కళాశాలలో శనివారం పట్టాలు, నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఉదయం 10 గంటలకు కార్యక్రమం పార్రంభం అవుతుందని తెలడపడంతో ముందుగానే అక్కడికి చేరుకున్న నిర్వాసితులు, లబ్ధిదారులు గంటల తరబడి వేచి చూసినా సంబంధిత అధికారులు ఆలస్యంగా వచ్చారు. చేసేది లేక నిర్వాసితులు చెట్ల కింద నిరీక్షణ చేయక తప్పలేదు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తమపై అధికారులు మాత్రం దయ చూపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
● నల్లమల సాగర్‌లో గాలిస్తున్న ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు
పెద్దదోర్నాల: ఫీడర్ కెనాల్లో గల్లంతైన యువకుడు రాజ్‌కుమార్ ఆచూకీ కోసం ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు శుక్రవారం కూడా జల్లెడ పట్టాయి. గత శనివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రాజ్‌కుమార్, వినయ్‌కుమార్‌లు నీటి తీవ్రతకు గల్లంతైన విషయం పాఠకులకు విదితమే. వినయ్‌కుమార్ మృతదేహం సుంకేసుల వద్ద లభించింది. రాజ్‌కుమార్ ఆచూకీ లభించక పోవడంతో గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. యువకుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


