● తహసీల్దార్‌కు నూజిళ్లపల్లి దళితుల అల్టిమేటం
జె.పంగులూరు: మండలంలోని నూజిళ్లపల్లి దళితులు తహసీల్దార్ సింగారావుకు అల్టిమేటం జారీ చేశారు. తమకు మాయమాటలు చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రోజుల తరబడి ఉంచడాన్ని దళితులు తప్పుబట్టారు. తమ గోడు అధికారులకు పట్టదా..తమ పట్ల వివక్ష కొనసాగించాల్సిందేనా, తమ దేవుడి విగ్రహాన్ని అప్పగించండి..అంటూ తహసీల్దార్ సింగారావును శుక్రవారం నిలదీశారు. ఏ నిర్ణయమైనా తాను తీసుకోలేనని, ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానని ఆయన చేతులెత్తేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, ఆర్చి నిర్మాణం అనుమతి కోసం నాలుగు రోజులుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నూజిళ్లపల్లి దళితులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దళితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి ఆయనతో మాట్లాడారు. అంతకుముందు దీక్షలను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాసి దేశానికి మార్గదర్శకత్వం చూపించిన మహానుభావుడి విగ్రహం పెట్టుకునేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదన్నారు. నెల రోజులుగా సమస్య స్థానిక మంత్రికి తెలిసినా ఆయన తెలిసీ తెలియనట్లు నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. సీఐటీయూ జిల్లా నాయకులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నా సామాజిక అంతరాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయని, దళితులు, పేదలను ఎదగనీయకుండా కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కౌలు రైతు సంఘ రాష్ట్ర నాయకుడు నాగబోయిన రంగారావు, మహిళా సంఘ జిల్లా నాయకురాలు రాయిని కృష్ణకుమారి మాట్లాడుతూ పెత్తందారులు, అధికారులకు వ్యతిరేకంగా అనేక సమస్యలపై పోరాడి సమస్యలు పరిష్కరించుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. నూజిళ్లపల్లిలో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్ఠ, ఆర్చి నిర్మాణం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ సింగారావు శిబిరం వద్దకు వచ్చి సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం, రైతు సంఘ జిల్లా నాయకులు తలపనేని రామారావు, హేమంత్, హనుమంతురావు, భానుప్రకాష్, రామారావు నాయకత్వం వహించారు.


