ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశుగ్రాస కొరతను ముందుగానే అంచనా వేసి గ్రామ స్థాయిలో గడ్డి బ్యాంకులు ఏర్పాటు చేయాలి. ఇటీవలే నేను రూ.20 వేలు పెట్టి గడ్డి కొనుగోలు చేశా. తక్కువ ధరకు ఎండుగడ్డి, పచ్చిగడ్డి అందుబాటులోకి తీసుకురావాలి. పశువులకు అవసరమైన దాణాపై సబ్సిడీ ఇవ్వాలి.
– సీహెచ్ చెంచిరెడ్డి, పాడి రైతు
మార్కాపురం: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్నే కాదు..పాడి పరిశ్రమను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురవక పోవడంతో పచ్చిగడ్డి లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పశువులకు మేత అందించేందుకు రైతులు మార్కెట్‌పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పాల దిగుబడి తగ్గుతుండగా మరోవైపు పశుగ్రాసం, దాణా ధరలు పెరగడంతో పాడి రైతులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.
పెరిగిన గడ్డి ధరలు
గతేడాది ఒక యూనిట్/ట్రాక్టర్ లోడు గడ్డి సుమారు రూ.12 వేలకు లభించగా ఈ ఏడాది అదే గడ్డి ధర రూ.20 వేలకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే సుమారు రూ.8 వేలకు పెరుగుదల నమోదైంది. ఇది దాదాపు 66.7 శాతం పెరిగినట్లు. గతంలో ఒక గేదె రోజుకు 3 నుంచి 4 లీటర్ల పాలు ఇవ్వగా ప్రస్తుతం ఒకటిన్నర నుంచి 2 లీటర్లు మాత్రమే ఇస్తోంది. పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్న రైతులకు ఈ అదనపు భారం మరింత తీవ్రంగా మారింది. పాలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగం మేత, దాణా కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తుండటంతో చేతికి మిగిలేది తక్కువగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గడ్డి లేదు..పాలు లేవు
సాధారణంగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి సమృద్ధిగా లభిస్తే పశువులకు తగిన పోషకాహారం అందుతుంది. దీంతో పాల దిగుబడి కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో పొలాల్లో పశుగ్రాసం పెరగడం తగ్గిపోయింది. దీంతో రైతులు బయట మార్కెట్‌లో అధిక ధరలకు గడ్డి కొనుగోలు చేయాల్సి వస్తోంది. పల్నాడు, నర్సరావుపేట, వినుకొండ, దర్శి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేశారు. ప్రస్తుతం అక్కడ కూడా పశుగ్రాసం లభించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మేత కొరతతో పశువులకు సరైన పోషకాహారం అందక పోవడంతో పాల దిగుబడి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. పాలు తగ్గినా పశువుల సంరక్షణ ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. మందులు, దాణా, గడ్డి, కూలీల ఖర్చులు యథాతదంగా లేదా మరింత పెరుగుతుండటంతో పాడి రైతులకు పాడి పరిశ్రమ భారంగా మారుతోంది. పాడి రైతుకు ప్రధాన ఆదాయ వనరు పాలే. రోజువారీ పాల దిగుబడి తగ్గితే నేరుగా ఆదాయంపై ప్రభావం పడుతుంది. అదే సమయంలో మేత ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఇలా ఆదాయం తగ్గడం.. ఖర్చులు పెరగడం అనే రెండు వైపులా రైతుపై భారం పడుతోంది. పశువులను పోషించడం కష్టంగా మారడంతో కొందరు రైతులు పశువుల సంఖ్యను తగ్గించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాభావంతో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం రాబోయే రెండు నెలల్లో ఎక్కువగా ఉంటోంది. వరి, జొన్న, సజ్జ తదితర పంటలు సాగులో లేకపోవడంతో మాగాణి భూములు సాగు కాలేదు. ఎల్‌నినో కారణంగా వర్షాలు తగ్గితే నవంబర్ నాటికి పశుగ్రాస కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పశుపోషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో పాల దిగుబడి తగ్గడం రైతులకు మరింత నష్టాన్ని తెచ్చి పెడుతోంది. ఒకవైపు పశువుల మేత కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండగా..మరోవైపు తక్కువ పాలు రావడంతో ఆశించిన ఆదాయం రావడం లేదు.
అల్లాడుతున్న పశుపోషకులు
వర్షాలు లేక గ్రాసానికి కొరత
పెరిగిన గడ్డి ధరలు..తగ్గిన పాల దిగుబడి
పశువుల పోషణకు అదనపు ఖర్చు
రోజుకు ఉత్పత్తి అయ్యే పాలు 5 లక్షల లీటర్లు
ప్రస్తుతం పాలదిగుబడి 4 లక్షల లీటర్లు
ట్రాక్టర్ గడ్డి రూ.20 వేలు
జిల్లాలో పశుసంపద ఇలా..
తెల్ల పశువులు : 35,988
నల్ల పశువులు : 3,40,493
గొర్రెలు : 11,00,669
మేకలు : 3,46,926
పాలిచ్చే గేదెలు : 2,04,295
రోజుకు పాలు సగటున : 3 లీటర్లు
గతంలో రోజుకు పాల దిగుబడి : 5 లక్షల లీటర్లు
ప్రస్తుత పాల దిగుబడి : 4 లక్షల లీటర్లు
రోజుకు కావాల్సిన గడ్డి : 3,500 టన్నులు (5 కిలోలు చొప్పున)
లభ్యమవుతున్న గడ్డి : 3 వేల టన్నులు (సుమారు)


