ఒంగోలు సబర్బన్: అంగన్‌వాడీ సెంటర్లు పోషణ్ ఫలహారాలకు కేంద్రాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు హాలులో గురువారం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాసోత్సవాల్లో జేసీ పాల్గొని మాట్లాడారు. మహిళలు గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం వరకూ, ప్రసవం తర్వాత చిన్నారులు, బాలింతలకు ఎన్నో రకాల పోషకాహారాలను అందించే కేంద్రాలుగా అంగన్‌వాడీ సెంటర్లను అభివర్ణించారు. ఉత్సవాల్లో పాల్గొన్న గర్భిణులు, చిన్నారులతో వచ్చిన బాలింతలతో జేసీ ముచ్చటించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పురుషులతో వంట ప్రదర్శన, ఆరోగ్యవంతమైన శిశువులను గుర్తించి బహుమతులివ్వడం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద గర్భిణులను నమోదు చేయించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వారికి పోషక విలువలు కలిగిన మునగాకు పొడి కూడా సరఫరా చేశారు. ఆరోగ్యవంతమైన పిల్లలకు జేసీ చేతుల మీదుగా నిర్వాహకులు బహుమతులిప్పించారు. గర్భిణులకు పోషకాహారం అందించారు.
జేసీ కల్పనా కుమారి


