హెర్బివోర్స్ ఎన్‌క్లోజర్లదీ అదే దుస్థితి
పులి కూనలు పెద్దయ్యాయి..ఎన్‌క్లోజర్‌కు దిక్కేలేదు!
మూడేళ్లుగా సాగని నిర్మాణం
రూ.2 కోట్లు కేటాయించినా ఫలితం శూన్యం
ఎన్‌క్లోజర్ పూర్తయ్యేలోపే పెద్దవైన పులి కూనలు
వన్యప్రాణుల సంరక్షణకు నిర్లక్ష్యపు కోరలు
పెద్దదోర్నాల: అడవిలో తల్లి ఒడిని వీడి అనాథలైన పులి కూనలకు ఆశ్రయం కల్పించాలన్న సంకల్పం.. అధికారుల అలసత్వంతో అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొంటోంది. సహజసిద్ధ వాతావరణంలో పెంచి.. వేటాడటం నేర్పి.. తిరిగి నల్లమల అడవుల్లోకి వదలాలన్న లక్ష్యంతో చేపట్టిన టైగర్ ఎన్‌క్లోజర్ పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించినా.. నిర్మాణం మాత్రం కొలిక్కి రాలేదు. ఫలితంగా ఏ పులి కూనల కోసం ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని భావించారో.. అవే కూనలు ఇప్పుడు నాలుగేళ్ల వయసుకు చేరి పెద్దపులులుగా మారాయి. నిర్మాణం పూర్తికాక.. ఉద్దేశం నెరవేరక.. కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రయోజనం లేకుండా పోతోంది.
పులి కూనల కోసం.. రూ.కోట్ల కేటాయింపు
2023 మార్చిలో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం వద్ద తల్లి పులి నుంచి విడిపోయిన నాలుగు పులి కూనలు స్థానికులకు కనిపించాయి. సుమారు 50 రోజుల వయసున్న ఆ కూనలను అటవీశాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్కుకు తరలించి సంరక్షణ చేపట్టారు. వాటిలో రెండు అనారోగ్యంతో మృతి చెందగా.. మిగిలిన రెండింటిని జూ అధికారులు కంటికి రెప్పలా కాపాడారు. క్రమంగా అవి పెరిగి పెద్దవుతుండటంతో సహజ వాతావరణంలోకి తీసుకెళ్లి.. స్వయంగా వేటాడేలా తీర్చిదిద్దాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2 కోట్లు మంజూరు చేసింది.
వేట నేర్పాల్సింది.. వేచి చూస్తున్నాం!
అనాథగా దొరికిన పులి కూనలను తొలుత నర్సరీ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. అనంతరం టైగర్ ఎన్‌క్లోజర్‌కు తరలించి.. సహజసిద్ధంగా వేటాడేలా శిక్షణ ఇస్తారు. ఎన్‌క్లోజర్‌లో జింకలు, దుప్పులు వంటి వన్యప్రాణులను వదిలి.. పులులు స్వయంగా వేటాడి ఆహారం సంపాదించుకునే సామర్థ్యాన్ని పెంచుతారు. ఒక్కో పులి కనీసం 50 వన్యప్రాణులను స్వయంగా వేటాడిన తర్వాత దాని వేట నైపుణ్యాన్ని పరిశీలించి.. అడవిలోకి వదిలేలా ప్రణాళిక రూపొందించారు. కానీ.. ఎన్‌క్లోజర్ సిద్ధం కాకపోవడంతో ఈ ప్రక్రియ అంతా కాగితాలకే పరిమితమైంది.
అడుగడుగునా నిర్లక్ష్యం
పులి కూనలను కాపాడి.. వాటిని అడవికి అప్పగించాలన్న మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ప్రాజెక్టు.. అధికారుల నిర్లక్ష్యంతో కాలయాపనకు చిహ్నంగా మారింది. అప్పట్లో చిన్నచిన్న కూనలుగా ఉన్న వాటి కోసం ఏర్పాటు చేయాల్సిన ఎన్‌క్లోజర్ పూర్తయ్యేలోపే అవి పెద్దపులులుగా ఎదిగాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పనులను వేగవంతం చేసి.. ఎన్‌క్లోజర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
పెద్దదోర్నాల మండల పరిధిలోని పెద్దపెంట వద్ద 15 హెక్టార్లలో టైగర్ ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు నర్సరీ, హెర్బివోర్స్ ఎన్‌క్లోజర్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడేళ్ల క్రితమే పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పులుల సంరక్షణకు కీలకమైన ఈ ప్రాజెక్టు పురోగతి మాత్రం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
పులులకు సహజసిద్ధమైన వేట అలవాటు చేయించేందుకు నెక్కంటి రేంజ్ పరిధిలోని ఆరపెంట, గంగారంపెంటతో పాటు పెద్దదోర్నాల మండలంలోని తెట్టుగూడెం తదితర ప్రాంతాల్లో జింకలు, దుప్పుల కోసం హెర్బివోర్స్ నర్సరీలను ఏర్పాటు చేశారు. పులి ఎన్‌క్లోజర్ సిద్ధమైతే వీటిని అక్కడికి తరలించి వేటాడే అవకాశాన్ని కల్పించాలన్నది అధికారుల ప్రణాళిక. ప్రధాన ఎన్‌క్లోజర్ పనులే ముందుకు సాగకపోవడంతో ఇవి కూడా నిరుపయోగంగా మారాయి.


