తొలిరోజే సర్వర్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

తొలిరోజే సర్వర్‌ షాక్‌

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల దరఖాస్తులకు అవరోధం స్తంభించిన సర్వర్లు దరఖాస్తుదారులకు తప్పని తిప్పలు తక్కువ గడువుతో ఆందోళన గంటల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అవస్థలు

టంగుటూరు/మార్కాపురం: రెండేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వారికి దరఖాస్తు దాఖలులో తొలిరోజే చుక్కలు కనిపించాయి. ఉమ్మడి జిల్లాలో సర్వర్‌ పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు అవస్థపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన గడువు తక్కువగా ఉండటం.. మరోవైపు ఆనన్‌లైన్‌ సర్వర్లు మొరాయించడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయాల వద్దకు చేరుకున్న ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాశారు. సర్వర్‌ ఎప్పుడు పనిచేస్తుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కొత్తగా ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాలు 905 ఉన్నాయి. వీటిల్లో దాదాపు 32 వేల మందికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లకు అర్హత ఉందని అధికారులు గుర్తించినట్టు తెలిసింది.

తొలిరోజే సర్వర్‌ షాక్‌...

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే సర్వర్లు స్తంభించడంతో వివరాలు నమోదు చేసుకోవడం కష్టంగా మారింది. సర్వర్‌ నెమ్మదిగా పనిచేయడం, పదేపదే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దరఖాస్తుదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. దరఖాస్తు కేంద్రాల వద్ద రద్దీ పెరిగినా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో చాలామంది గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.

గడువు తక్కువ.. గుబులు ఎక్కువ...

తొమ్మిది రోజుల వ్యవధిలోనే దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు, నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో సైట్‌ సక్రమంగా పనిచేయకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో దరఖాస్తు ప్రక్రియ నత్తనడకన సాగిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ వ్యవధి మాత్రమే ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తొలిరోజే సర్వర్‌ సమస్యలు తలెత్తితే మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్‌ సమస్యలను వెంటనే పరిష్కరించి గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు.

వృద్ధులు.. వితంతువులకు అవస్థలు...

ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన లేని వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత కార్మికుల, మత్య్సకారుల, డప్పు కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు లేదా ఇతరుల సహాయం తీసుకోవాల్సి రావడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచి ఉండటంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ఆధార్‌–మొబైల్‌ అనుసంధానానికి పాట్లు...

దరఖాస్తు ప్రక్రియలో ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ అనుసంధానం, ఓటీపీ వంటి ప్రక్రియలు కూడా అర్జీదారులకు మరో సమస్యగా మారాయి. మొబైల్‌ నంబర్‌ అనుసంధానం లేకపోవడం, ఓటీపీ ఆలస్యంగా రావడం లేదా రాకపోవడంతో పలువురు దరఖాస్తుదారులు ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలకే గంటల సమయం వృథా అవుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement