భోజనం బాగాలేదు..వసతులు లేవు | - | Sakshi
Sakshi News home page

భోజనం బాగాలేదు..వసతులు లేవు

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

హాస్టళ్లలో మెనూ పాటించడం లేదని ఏపీ ఫుడ్‌ కమిషనర్‌కి విద్యార్థినుల ఫిర్యాదు వార్డెన్‌పై కమిషనర్‌ ఆగ్రహం సంక్షేమ హాస్టళ్లు, గిరిజన గురుకుల పాఠశాల, రేషన్‌షాపుల తనిఖీ

గిద్దలూరు రూరల్‌: భోజనం బాగుండటం లేదు..మెనూ పాటించడం లేదు.. హాస్టళ్లలో కనీస వసతులు లేవంటూ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థినులు ఏపీ ఫుడ్‌ కమిషనర్‌ విజయప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం, పెద్దపోస్టాఫీస్‌ వద్ద పోస్ట్‌మెట్రిక్‌ బాలికల వసతి గృహం, ఎస్టీ బాయ్స్‌ హాస్టల్‌, గిరిజన గురుకుల పాఠశాల, రాచర్ల రోడ్డులో పోస్ట్‌ మెట్రిక్‌ బాలుర వసతి గృహం, పోలీసు స్టేషన్‌ సమీపంలోని రేషన్‌షాపులను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ బాలికల వసతి గృహం, పోస్ట్‌మెట్రిక్‌ ఎస్సీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులు హాస్టళ్లలో వసతులు సక్రమంగా లేవని, భోజనంలో మెనూ పాటించడం లేదని, మినరల్‌ వాటర్‌ ఇవ్వడం లేదని వారి సమస్యలను విజయప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రెండు హాస్టళ్లకు వార్డెన్‌ జయమ్మ బాధ్యతలు నిర్వహిస్తూ అక్కడి విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తోందని గ్రహించి ఆమైపె కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్‌ మెట్రిక్‌ ఎస్సీ బాలికల వసతి గృహంలో రక్షణ కరువైందని, కొందరు ప్రైవేటు వ్యక్తులు హాస్టల్‌ ముందు భాగంలో ఉండే ఖాళీ ప్రదేశంలోకి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని కొందరు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై వెంటనే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా వార్డెన్‌కు కమిషనర్‌ సూచించారు. మెనూలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటానన్నారు. సమస్యలు తెలిపిన విద్యార్థినులపై వేధింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వారికి ఆయన ఫోన్‌ నంబర్‌ ఇచ్చి భరోసానిచ్చారు. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలుసుకుని కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు, డీలర్లు, వార్డెన్‌లు అందుబాటులో ఉండకుండా వెళ్తున్నారని కమిషనర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏఎస్‌డబ్ల్యూఓ ఎం.విజయభాస్కర్‌రావు, వార్డెన్‌లు, వీఆర్‌ఓ నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement