కొనకనమిట్ల: మండలంలోని పెదారికట్ల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. బల్లికురవ మండలం పల్లాయపాలెం గ్రామానికి చెందిన ఆర్.సామ్యూల్ కుటుంబంతో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు బ్రహ్మంగారిమఠం వెళ్తుండగా, కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సామేలు కుటుంబం కారులో నుంచి బయటకు దిగగా.. కొంతసేపటికే కారు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలార్పారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


