రైతులనూ వదలకుండా.. కూటమి నేతల దౌర్జన్యకాండ..! | - | Sakshi
Sakshi News home page

రైతులనూ వదలకుండా.. కూటమి నేతల దౌర్జన్యకాండ..!

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

మర్రిపూడి:

కూడు పెట్టే అన్నదాతలపై సైతం కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. భూమిని నమ్ముకుని కాయాకష్టం చేసుకుని జీవించే రైతులపై టీడీపీ సానుభూతిపరుల దౌర్జన్యం రోజురోజుకూ పెచ్చురిల్లుతోంది. రైతులు తమ పొలం పక్కనే ఖాళీగా ఉన్న కొంతభూమిని దున్నుకుని సజ్జ సాగు చేస్తే.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తారా.? అంటూ పొట్టదశలో ఉన్న సజ్జ పంటకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ రాళ్లను రెవెన్యూ అధికారులు డోజర్‌ సహాయంతో పట్టపగలే విచక్షణా రహితంగా విరగ్గొట్టి పడగొట్టారు. పైగా, వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు పొలం వద్దకు పరుగులు తీశారు. లబోదిబోమన్నా కనికరించలేదు. మా చేలకు రక్షణగా వేసుకున్న ఫెన్సింగ్‌ రాళ్లు, తీగలు ధ్వంసం చేయవద్దని వేడుకున్నాగానీ.. రెవెన్యూ అధికారులు లెక్కచేయకపోవడంతో చివరకు పురుగుమందు తాగి చనిపోతామని రైతులు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. మర్రిపూడి మండలంలోని గంగపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...

మర్రిపూడి పంచాయతీ పరిధిలోని గంగపాలెం గ్రామంలో సర్వే నంబర్‌ 185లో 8.03 ఎకరాలు, సర్వే నంబర్‌ 176లో 20 ఎకరాల మేత భూమి ఉంది. ఆ భూమిని గత 50 ఏళ్లుగా గ్రామానికి చెందిన ఇరుపార్టీల రైతులు ఒక్కో రైతు ఎకరా నుంచి అరెకరా చొప్పున సాగుచేసుకుని జీవిస్తున్నారు. మర్రిపూడి – గంగపాలెం రహదారిలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వేశారు. హైవేను ఆనుకుని సర్వే నంబర్‌ 184లో కొంత పట్టా భూమి ఉంది. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు బోన వెంకటనారాయణ, బోన రమణయ్య, బోన శ్రీనివాసరెడ్డి కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. కౌలుకు తీసుకున్న పట్టా భూమిని ఆనుకుని ఉన్న మరో 1.5 ఎకరాల మేత భూమి కూడా సాగు చేస్తున్నారు. సోమవారం టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్‌ జనార్దన్‌ వీఆర్‌ఓ బడే సాహెబ్‌, తలారి నరసింహారావులను ఆ పొలం వద్దకు పంపించారు. డోజర్‌ సహాయంతో ఫెన్సింగ్‌ రాళ్లు పడేసి విచక్షణారహితంగా విరగ్గొట్టించారు. విషయం తెలుసుకున్న రైతులు హడావిడిగా పొలం వద్దకు చేరుకుని రెవెన్యూ అధికారులకు నచ్చేజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పొట్ట దశలో ఉన్న సజ్జ పంటను ఇన్నాళ్లూ కాపాడుకున్నామని, తీరా కోత దశలో ఫెన్సింగ్‌ రాళ్లు విరగ్గొడితే పంటను పశువుల నుంచి ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు. రైతులకు ముందుగా సమాచారం ఎందుకివ్వలేదని నిలదీశారు. కనీసం దండోరా కూడా వేయించలేదన్నారు. గ్రామస్తులందరూ మేత భూమిని తలా ఎకరా, అరెకరా చొప్పున గత 50 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారని, ఇప్పుడే ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో చివరకు రైతులు పురుగుమందు డబ్బా తీసుకుని తమ చేల వద్ద నిలబడ్డారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి మర్రిపూడి వీఆర్‌ఓ బడే సాహెబ్‌, తలారి గురిజాల నరసింహారావు తిరుగుముఖం పట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement