వల్లూరు చెరువు..మట్టి మాఫియా దరువు..! | - | Sakshi
Sakshi News home page

వల్లూరు చెరువు..మట్టి మాఫియా దరువు..!

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

టంగుటూరు: మండలంలోని వల్లూరు చెరువు మట్టి మాఫియా అక్రమార్జనకు అడ్డాగా మారింది. ఒకప్పుడు ఆ గ్రామంలో నీటికి ఆధారంగా ఉన్న చెరువు.. నేడు మట్టి మాఫియాకు ఆదాయ వనరైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వల్లూరు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అనుమతులు, నిబంధనలను పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పగలూరాత్రీ తేడా లేకుండా మట్టి తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలిస్తున్న విషయం కళ్లకుకట్టినట్లు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వెనుక భారీగా అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోజూ వందలాది ట్రిప్పులు...

వల్లూరు చెరువులో మూడు చిన్న జేసీబీలు, ఒక భారీ జేసీబీతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు యంత్రాలు పనిచేస్తూనే ఉంటున్నాయి. భారీ స్థాయిలో మట్టిని బయటకు తరలిస్తున్నారు. నిత్యం సుమారు ట్రాక్టర్లతో 300 ట్రిప్పులు, లారీలతో 100 ట్రిప్పుల వరకు మట్టి తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దాని ప్రకారం.. రోజూ వేల టన్నుల మట్టిని చెరువులో తవ్వి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఒంగోలు, పరిసర ప్రాంతాల్లోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ప్లాట్లను చదును చేసేందుకు మట్టి సరఫరా చేస్తూ అక్రమార్కులు యథేచ్ఛగా దోచుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు మట్టికి డిమాండ్‌ ఉండటంతో కాసుల వర్షం కురిపిస్తోందని చెబుతున్నారు.

ఇదే కొనసాగితే భవిష్యత్తులో చెరువుకు ముప్పు...

చెరువులో ఇదే విధంగా మట్టి తవ్వకాలు కొనసాగితే చెరువు అసలు స్వరూపం దెబ్బతినడంతో పాటు భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఇంత భారీ స్థాయిలో యంత్రాలు, వాహనాలతో మట్టి తవ్వి తరలిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మట్టి తవ్వకాలకు అనుమతులున్నాయా..? ఉంటే ఎంత మేరకు తవ్వకాలకు అనుమతిచ్చారు..? నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా..? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. వల్లూరు చెరువు మట్టి దోపిడీపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తవ్వకాలకు సంబంధించిన అనుమతులు, మట్టి తరలింపు, వాహనాల రాకపోకలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

అడ్డగోలుగా మట్టి తవ్వి తరలిస్తున్నా

పట్టించుకోని అధికారులు

నాలుగు జేసీబీలతో చెరువులో

మట్టి తవ్వి కొల్లగొడుతున్న వైనం

ప్రతిరోజూ ట్రాక్టర్లతో 300 ట్రిప్పులు, లారీలతో 100 ట్రిప్పులతో వేల టన్నుల మట్టి రవాణా

ఒంగోలులో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు,

ప్లాట్లకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement