● సుంకేసుల నిర్వాసితులకు మార్కాపురం కలెక్టరేట్‌లో
ఇళ్ల పట్టాలు, సామగ్రి పంపిణీ
● మార్కాపురం పట్టణానికి దూరం కావడంతో
తరలించేందుకు అవస్థలు
మార్కాపురం/
మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసుల నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మార్కాపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు, ఆర్డీఓ శివరామిరెడ్డి, తహసీల్దార్లు కలిసి ఇళ్ల పట్టాలతో పాటు రేషన్ కిట్లు, పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేశారు. అయితే, పంపిణీ కార్యక్రమం వద్ద కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరికి ఏ వస్తువు ఎక్కడివ్వాలి.. ఎక్కడ తీసుకోవాలనే విషయంలో స్పష్టత లేకపోవడంతో నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఇళ్ల పట్టాలు, మరోవైపు రేషన్‌్ కిట్లు, పసుపు, కుంకుమ, చీరలు తీసుకోవాల్సి రావడంతో పాటు మార్కాపురం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్ ఉండటంతో సామగ్రి మోసుకుని వెళ్లేందుకు నిర్వాసితులు అవస్థపడ్డారు. ఆటోల్లో సామగ్రి తరలించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామగ్రి తరలించేందుకు ఆటో చార్జీలు అధికంగా ఉండటంతో అదనపు భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామగ్రిని కలెక్టరేట్ వద్ద కాకుండా పట్టణంలోనే అందజేసి ఉంటే ఇబ్బందులు తప్పేవని పలువురు పేర్కొన్నారు. దాంతో పాటు ఇళ్ల పట్టాలు, రేషన్ కిట్లు, చీరలు తదితర వస్తువులను ఒకేచోట క్రమపద్ధతిలో అందజేసి ఉంటే వృద్ధులు, మహిళలు, పిల్లలతో వచ్చిన కుటుంబాలకు సౌకర్యంగా ఉండేదన్నారు.


