‘టెట్‌’ టెన్షన్‌..! | - | Sakshi
Sakshi News home page

‘టెట్‌’ టెన్షన్‌..!

Sep 7 2026 12:21 AM | Updated on Sep 7 2026 12:21 AM

టీచర్లకు

ఒంగోలు సిటీ:

విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉపాధ్యాయులకు కొత్త టెన్షన్‌ తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా టెట్‌ అర్హతను పదోన్నతులతో ముడిపెట్టడం, సుదీర్ఘకాలంగా బోధనలో కొనసాగుతున్న సీనియర్‌ ఉపాధ్యాయులు మళ్లీ అర్హత పరీక్ష రాయాల్సిన పరిస్థితి కల్పించడం ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులతో సహా టెట్‌ నిబంధనల పరిధిలోకి వచ్చే వారిపై పరీక్ష భారాన్ని మోపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లకుపైగా సర్వీసున్న ఉపాధ్యాయులు నిర్దేశిత వ్యవధిలో టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో సీనియర్‌ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పదవీ విరమణకు ఐదేళ్లలోపు సర్వీసున్న వారికి కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ.. పదోన్నతుల విషయంలో టెట్‌ అర్హత తప్పనిసరి చేయడం మరింత ఇబ్బందికరంగా మారిందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులు సుమారు 3500 మంది వరకు ఉన్నారు.

ఏళ్ల తరబడి తరగతి గదుల్లో బోధిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు మళ్లీ అర్హత పరీక్ష పెట్టడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్లుగా ఎలిమెంటరీ స్థాయిలో బోధిస్తున్న ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్‌ పరీక్షలో అధిక స్థాయి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి రావడం తమకు అన్యాయమని వాపోతున్నారు. టెట్‌ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. అర్హత మార్కులు కూడా కేటగిరీల వారీగా నిర్ణయించడంతో సీనియర్‌ ఉపాధ్యాయుల్లో పోటీ ఒత్తిడి పెరుగుతోంది. ఓసీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, తదితర రిజర్వుడ్‌ కేటగిరీలకు 40 శాతం అర్హత మార్కులు ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం మాత్రమే ఉండటం, ముఖ్యంగా గణిత ప్రశ్నలను పరిష్కరించేందుకు తగినంత సమయం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

టెట్‌ పేపర్‌–2లో సబ్జెక్టుల కలయిక కూడా ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. బయాలజీ ఉపాధ్యాయులు గణిత సంబంధిత ప్రశ్నలు, గణిత ఉపాధ్యాయులు బయాలజీ అంశాలను ఎదుర్కోవాల్సి రావడం, తెలుగు, సోషల్‌ స్టడీస్‌ ఉపాధ్యాయులు పరస్పరం సంబంధం లేని సబ్జెక్టుల ప్రశ్నలు రాయాల్సి రావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా ఒక నిర్దిష్ట సబ్జెక్టు బోధిస్తున్న ఉపాధ్యాయుడి సామర్థ్యాన్ని సంబంధం లేని మరో సబ్జెక్టులో పరీక్షించడం వలన బోధనా నైపుణ్యానికి బదులు పరీక్ష సామర్థ్యమే ప్రమాణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టెట్‌ రాయాల్సిన ఉపాధ్యాయుల్లో గణనీయమైన సంఖ్యలో 50 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష వారికి ఇబ్బందికరంగా మారుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సుదీర్ఘ సర్వీసున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.

2010కి ముందు విద్యాభ్యాసం చేసిన ఉపాధ్యాయుల్లో చాలామంది తెలుగు మీడియంలో చదువుకున్నవారే. టెట్‌లో తెలుగు–ఇంగ్లిష్‌ పదజాలం, అనువాద పదాల కారణంగా కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ప్రశ్నల భాషను సరళీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

1 నుంచి 5వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి ఎలిమెంటరీ విద్యార్థులకు బోధిస్తున్నారు. అలాంటి వారికి వారి బోధనా స్థాయికి సంబంధం లేని విధంగా అధిక కాఠిన్యతతో ప్రశ్నలివ్వడం సరికాదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. సీనియారిటీ, బోధనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్‌ను కీలక అర్హతగా ముడిపెట్టడం వలన ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి కొత్త ఒత్తిడి ఏర్పడిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్లపాటు సేవ చేసిన ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి అర్హత పరీక్షతో వారి భవిష్యత్తును ముడిపెట్టడం పునరాలోచించాల్సిన అంశమని అంటున్నారు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను పరీక్షల ఒత్తిడిలోకి నెట్టకుండా సీనియారిటీ, అనుభవం, ఇప్పటికే ఉన్న విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వయసు పైబడిన వారికి ఆఫ్‌లైన్‌ పరీక్ష, సబ్జెక్టుకు సంబంధం లేని ప్రశ్నల తొలగింపు, ప్రశ్నపత్రం కాఠిన్యత తగ్గింపు, అదనపు సమయం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో బోధనపై దృష్టి పెట్టాల్సిన ఉపాధ్యాయులు పరీక్షల భయంతో సతమతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పదోన్నతులకు పరీక్షా పర్వతం

రెండేళ్లలో పాస్‌ కాకుంటే ఉద్యోగానికే ముప్పు..?

విద్యాశాఖ నిర్ణయాలతో సీనియర్‌ ఉపాధ్యాయుల్లో ఆందోళన

సంబంధం లేని సబ్జెక్టులపై పరీక్షలతో ఇబ్బందులు

సబ్జెక్టు కాని సబ్జెక్టుతో సతమతం..!

ఆన్‌లైన్‌ పరీక్షపై అభ్యంతరాలు...

తెలుగు మీడియం వారికి భాషా సమస్య...

ఎలిమెంటరీ టీచర్లకు

10వ తరగతి స్థాయి ప్రశ్నలా..?

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి :

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులను టెటు పరీక్ష నుంచి మినహాయించేలా ఆర్టీఏ యాక్టు విద్యాహక్కు చట్టంలోని 23(1) క్లాజుకి సవరణ చేసి 2011కు ముందున్న ఉపాధ్యాయులందరినీ టెట్‌ ఎగ్జామ్‌ నుంచి మినహాయించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిర్వహించే డిపార్టుమెంట్‌ పరీక్షల అర్హత మార్కులు 40 శాతం మాదిరిగా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు సిలబస్‌ తగ్గించి స్పెషల్‌ టెట్‌ నిర్వహించాలి. అన్ని కేటగిరి ఉపాధ్యాయులకు కామన్‌గా 150 మార్కులకు 40 శాతం.. అనగా 60 మార్కులు ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించాలి. అలాకాకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్‌

ఉద్యోగం వచ్చిన తర్వాత

మళ్లీ పరీక్ష ఎందుకు..?

పరీక్ష పాసైతేనే

పదోన్నతి అనడంపై అసంతృప్తి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement