కనిగిరిరూరల్: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం కనిగిరిలో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. కనిగిరి మండలం బొట్టికిర్లపాడుకు చెందిన పొదిలి మల్లేశ్వరి (35)కి హనుమంతునిపాడు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన కొండలరావుకు సుమారు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు పట్టణంలోని బాదుల్లా వారి వీధిలో దాదాపు 4 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. కొద్ది కాలంగా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మల్లేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం మృతురాలి తల్లి చందలూరి మహాలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● బాలుడు మృతి
మద్దిపాడు: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో బాలుడు మృతిచెందిన సంఘటన జాతీయ రహదారిపై మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఆ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ తన కుటుంబంతో కలిసి అరుణాచలానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెల్లంపల్లి సమీపంలోకి వచ్చిన క్రమంలో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో బెలూన్లు తెరుచుకోవడంతో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శ్రీకాంత్‌కు స్వల్పగాయాలయ్యాయి. మధ్య సీటులో పడుకుని నిద్రిస్తున్న శ్రేయాన్ష్‌రామ్ (16)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ చేరుకుని ఒంగోలు జీజీహెచ్‌కి తరలించింది. అక్కడి డాక్టర్లు పరీక్షించి శ్రేయాన్ష్‌రామ్ మృతి చెందినట్లు తెలిపారు. మద్దిపాడు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం టౌన్: పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలోని ఇంట్లో దొంగలు పడి రూ.50 వేల నగదు అపహరించారు. పోలీసుల వివరాల మేరకు..కాలనీలోని విజయకుమారి ఇంట్లో శనివారం దొంగలు పడి రూ.50వేలు నగదు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● కారుపై పడిన సిమెంట్ బస్తాలు
● తప్పిన పెను ప్రమాదం
● ఇద్దరికి గాయాలు
మార్కాపురం రూరల్: మండలంలోని కోమటికుంట వద్ద అదివారం సిమెంట్ లారీ బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే..మాచర్ల నుంచి కడపు వైపు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ...ఎదురుగా వచ్చినా కారును తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న సిమెంట్ బస్తాలు రోడ్డుపై పడిపోయాయి. అదే సమయంలో నంద్యాల నుంచి తెనాలి వైపు వెళ్తున్న మరో కారుపై సిమెంట్ బస్తాలు పడటంతో వాహనంలోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కారుఓ ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. కొంత సేపు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కారులో ఉన్న వాణిశ్రీ తీవ్రంగా గాయపడటంతో ఆమెను తొలుత మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి జిజిహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు హాస్పిటల్‌కు వైద్యులు రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


