● 25న ప్రారంభించేందుకు ఏర్పాట్లు
● సీఈఓ, డిప్యూటీ సీఈఓ సిబ్బంది నియామకంపై దృష్టి
మార్కాపురం: మార్కాపురం నూతన జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని 21 మండలాలను కలిపి నూతన జిల్లా పరిషత్ ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓతో పాటు సిబ్బందిని కూడా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 25న జడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించాలని అధికారులు సన్మాహాలు చేస్తున్నారు. ప్రకాశం సీఈఓ చిరంజీవి మార్కాపురం జిల్లాకు కూడా ఇన్‌చార్జి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన మార్కాపురంలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటుకోసం పలు కార్యాలయాలను సందర్శించారు. రేడియో స్టేషన క్వార్టర్స్, రాయవరంలోని డీడీఓ కార్యాలయ ఆవరణ, ఇంకా పలు ప్రైవేట్ భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం ఒంగోలు జెడ్పీలో ఉన్న సిబ్బందిలో 50 శాతం ప్రకాశానికి, 38 శాతం మార్కాపురంకు, 12 శాతం బాపట్లకు కేటాయించినట్లు తెలిసింది. ముగ్గురు సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్లు తదితర సిబ్బంది అంతా కలిపి సుమారు 25 మంది వరకూ రానున్నారు. మొత్తం జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 14,82,757.24 ఎకరాల్లో ఉంది. జిల్లాలో మొత్తం 1145 పోలింగ్ స్టేషన్లతో పాటు మొత్తం 9,08,772 మంది ఓటర్లు ఉన్నారు. నూతన జడ్పీ ఏర్పాటైతే జడ్పీ సమావేశాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీసి, ఎంపీడిఓల శిక్షణా తరగతులు ఇక్కడే జరగనున్నాయి. నూతన జెడ్పీ ఏర్పాటుకు ముందే ఒంగోలు జెడ్పీలో ఉన్న సిబ్బందిని ఆయా జిల్లా పరిషత్‌ల నిష్పత్తి ప్రకారం కేటాయించనున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి తెలిపారు.
● సత్తా చాటిన తెలంగాణ ఎడ్లు
రాచర్ల: మండలంలోని జేపీ చెరువులో ఆదివారం రాష్ట్రస్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో మొత్తం 5 జతల ఎడ్లు పాల్గొనగా తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూలు జిల్లా, లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన ఎం.అక్షరారెడ్డి ఎడ్ల జత నిర్ణీత 20 నిమిషాల్లో 3283 అడుగులు లాగి మొదటి బహుమతి సాధించాయి. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన ఎం.అక్షరారెడి చెందిన ఎడ్లజత 3251 అడుగులు లాగి రెండో బహుమతి సాధించాయి. నల్గొండ జిల్లా కొప్పుల గ్రామానికి చెందిన సత్యనారాయణ చెందిన ఎడ్లజత 2368 అడుగులు లాగి మూడో బహుమతి సాధించాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన నారాయణ ఎడ్లజత 1250 అడుగులు లాగి నాల్గవ బహుమతి, కొమరోలు మండలం, ఎడమకల్లు గ్రామానికి చెందిన నోస్సం వెంకటేశ్వర్లు చెందిన ఎడ్లజత 1000 అడుగులు లాగి ఐదో బహుమతిని సాధించాయి. ఎడ్ల పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ.50వేలు, రూ.35 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను గ్రామపెద్దల చేతులు మీదుగా పంపిణీ చేశారు.


