మార్కాపురం: ఉర్దూ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ అన్వర్ ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని 2వ వార్డులో ఉన్న ఉర్దూ ప్రైమరీ స్కూల్‌లో ఆదివారం జిల్లా ఉర్దూ టీచర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీసు, అర్హతలు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉర్దూ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలని, ఖాళీగా ఉన్న కేటగిరి ఉర్దూ టీచర్ పోస్టులను రానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో చూపించి భర్తీ చేయాలని, ఉర్దూ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉర్దూ అంగన్‌వాడీ సెంటర్లను ప్రారంభించాలని తెలిపారు. ఉర్దూ పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు సకాలంలో అందించాలని, జిల్లాలోని ప్రతీ హైస్కూల్‌లో 20 మంది ముస్లిం విద్యార్థులు ఉన్న చోట ఒక ఉర్దూ బీఈడీ పోస్టును మంజూరు చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రుటా మార్కాపురం జిల్లా నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు. మార్కాపురం జిల్లా యూనిట్‌గా రాష్ట్ర ఉర్దూ ఉపాధ్యాయసంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సయ్యద్ సమీవుల్లా బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రూటా జనరల్ సెక్రటరీగా పఠాన్ ముర్తుజావలి ఖాన్, కోశాధికారిగా ఎం. గుల్షన్ అహ్మద్ బేగ్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా షేక్ ఖాజావలి, ఎలక్షన్ అధికారిగా పఠాన్ హకీమ్ ఖాన్ వ్యవహరించారు. సమావేశం లో రూట కార్యవర్గ సభ్యులు షేక్. అన్వర్ బాషా, సయ్యద్ సమీవుల్లాబాషా, పఠాన్ హిదాయతుల్లా ఖాన్, షేక్ బురాని పీరా, పఠాన్ హకీమ్‌ఖాన్, ఉర్దూ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు పఠాన్ అబ్దుల్ వహీద్‌ఖాన్, ఉర్దూ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


