సంక్షోభంలో రొయ్యల రైతులు మొన్న మోంథా, నేడు ఎల్‌నినో వరుసగా రెండేళ్లు రొయ్యల సాగులో నష్టాలు ఏడాదిలోనే ఫీడ్ ధర టన్ను రూ.14 వేల పెంపు రొయ్యల ధర కేజీకి రూ.120 తగ్గింపు ఐదు నెలలకు రావాల్సిన పంట ఏడు నెలలైనా రాని వైనం
కొత్తపట్నం: రొయ్యల సాగు సంక్షోభంలో చిక్కుకుంది. రొయ్యలకు ధర తగ్గిందని ఒక పక్క రైతులు ఆందోళన చెందుతుంటే మరోవైపు ఫీడ్ ధర విపరీతంగా పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాదిలో ఊహించని రీతిలో ఫీడ్ టన్నుకు రూ.28 వేలు పెరిగింది. ఈ భారం పూర్తిగా రైతులపై పడింది. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దాక నష్టం వాటిల్లింది. రెండేళ్ల నుంచి రొయ్యల రైతులకు పంటలు రాక వరుసగా నష్టపోతున్నారు. తెచ్చిన పెట్టుబడులకు వడ్డీలు రెట్టింపు కావడంతో అప్పుల భారం పెరిగిపోతోందని రైతులు వాపోతున్నారు. మండలంలో వ్యవసాయం తర్వాత ఆక్వా సాగు రెండోదిగా ఉంది. మండలంలో సుమారు 3 వేల ఎకరాలు రొయ్యల సాగు చేస్తున్నారు. బీరంగుంట, మోటుమాల, గుండమాల, పాదర్తి, కొత్తపట్నం, ఈతముక్కల, మడనూరు గ్రామాల పరిధిలో రొయ్యలు సాగు అధికంగా ఉంది.
మొన్న మోంథా.. నేడు ఎల్‌నినో:
రెండేళ్లల్లో మోంథా, ఎల్‌నినో వలన రొయ్యల రైతులపై ప్రభావం పడింది. ఈ విపత్తుల వలన రొయ్యల రైతులు కోలుకునే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలయ్యారు. గత ఏడాది మోంథా తుఫాన్ వచ్చి చేతికి వచ్చిన రొయ్యలు వరదకు కొట్టుకుపోయాయి. పెట్టిన పెట్టుబడి రాక భారీగా నష్టపోయారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వలన ఐదు నెలలకు కేజీకి 20 కౌంట్ రావాల్సి ఉండగా ఏడు నెలలు కావస్తున్నా 20 కౌంట్‌కు రాలేదు. వర్షం లేక అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత వల్ల నీటిలో వేడి శాతం పెరిగి రొయ్యల పెరుగుదల మందగించింది. దీంతో రెండు నెలలు పాటు ఫీడ్ ఖర్చు, అదనపు ఖర్చుల భారం పడింది. ఇవన్నీ చూసుకుంటే చివరికి నష్టం మిగిల్చింది.
ఏడాదిలోనే టన్ను మేత రూ.28 వేలకు పెంపు
ఆక్వా కల్చర్ ప్రారంభం నుంచి చూస్తే ఈ ఏడాది పెరిగినంత ఫీడ్ ధర ఎన్నడూ లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మూడు సార్లు కేజీకి రూ.28 పెంచారు. దీని ప్రకారం టన్ను మేత కొంటే రూ.28 వేలు అదనంగా పడుతుంది. ఒక చెరువుకు 5 టన్నుల నుంచి 6 టన్నులు మేత వాడతారు. టన్నుకు రూ.14 వేల నుంచి రూ.16 వేల దాక అదనంగా రైతుపై భారం పడుతుంది. కూటమి ప్రభుత్వం రొయ్యల మేత యజమానులతో కుమ్మకై ్క ఇష్టానుసారంగా మేతను పెంచుతున్నారు. మేత ధర తగ్గించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు చెబుతున్నారు.
టైగర్ రొయ్యల ధర తగ్గింపు
ఒక వైపు రొయ్యల మేత పెరిగిందని, ఎక్కువ రోజులైనా తగిన కౌంట్‌కు రాలేదని అల్లాడుతుంటే రొయ్యల ధరలు గణనీయంగా తగ్గించారు. రొయ్యల రైతులను ఎవరికి తగ్గట్టుగా వారు ఆటాడుకుంటున్నారు. కేజీకి 30 తూగే రొయ్యల ధర రూ.520 నుంచి రూ.440, 20 కౌంట్ రూ.720 ఉండాల్సిన ధర రూ.600 తగ్గించారు. దీంతో ఒక్కో రైతుకు టన్నుకు రూ.1.20 లక్షలు నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నుడూలేని విధంగా ఈ ఏడాది ధర పతనమైందని రైతులు అంటున్నారు. 5 నెలలు రావాల్సిన కల్చర్‌కు 7 నెలలకు వెళ్లడంతో ఖర్చు పెరగడం, ఫీడ్ ధర పెరగడం, రైతు పండించిన రొయ్యలు టన్ను రొయ్యలకు ధర రూ.1.20 లక్షలు తగ్గించడం ఇవన్నీ లెక్కవేస్తే ఒక్కో చెరువు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు దాకా నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు.


