బాబు డాబుసరి మాటలు, డబ్బా కబుర్లకు నిదర్శనమే వెలిగొండ జగన్‌ను తిట్టించేందుకే హెలికాప్టర్ ద్వారా మాగుంటను రప్పించారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శ
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం అంతా వైఎస్సార్ కుటుంబ పుణ్యమేనని, చంద్రబాబువి డబ్బా కుబుర్లు, డాబుసరి మాటలేనని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. మండల పరిధిలోని కొత్తూరు వద్ద నిర్మించిన సొరంగ ప్రాంతానికి చేరుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేసిన స్థూపాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తాటిపర్తి మాట్లాడుతూ కొత్తూరు వద్ద నిర్మించిన రెండు సొరంగ నిర్మాణాలు, గొట్టిపడియ డ్యాం, సుంకేసుల డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు కెనాల్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ తవ్వకం ఇవన్నీ పూర్తి చేసింది రాజశేఖర్‌రెడ్డేనని, ఇందులో చంద్రబాబు ప్రమేయం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. నల్లమల సాగర్‌లో ఈ తట్ట మట్టి తీశారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఊసరవెల్లి విధానాలను మార్చుకోవాలని, ఎవరికో దక్కాల్సిన క్రెడిట్‌ను చోరీ చేయడం ఆపాలన్నారు. ఇప్పుడు వదలిన 10 టీఎంసీలు డెడ్ స్టోరేజీ మాత్రమేనని, తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా ప్రజలకు అందదన్నారు. ముందు 10 వేల కుటుంబాల త్యాగాన్ని గుర్తించాలని ఆయన కోరారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టించేందుకు హెలికాప్టర్‌లో మాగుంటను రప్పించారని విమర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి, నాయకులు దూదేకుల రసూల్, ఒంటేరు నాగేశ్వరరావు, పవన్‌కుమార్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
పునరావాస కేంద్రంలో
సదుపాయాల కల్పనలో విఫలం
పెద్దారవీడు: మండలంలోని తోకపల్లి సమీపంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసుల పునరావాస కేంద్రంలో కనీస సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకేసుల పునరావాస కేంద్రాన్ని ఆదివారం హైకోర్టు న్యాయవాది రజినీతో కలిసి సందర్శించిన తాటిపర్తి నిర్వాసితుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో కనీస సదుపాయాలు కల్పించి, వారికి ఇంటి పట్టాలు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వాసితులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని అధికారులు సమాచారం ఇచ్చారని, అయితే పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వాసితులను అప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి రావాలని చెప్పడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో నిర్మించిన బ్రిడ్జిల కింద, అంగన్‌వాడీ కేంద్రంలో, చర్చిలో చాలా మంది నిర్వాసితులు తలదాచుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నిర్వాసితులు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు తమ వద్దకు వచ్చి పరిస్థితులను పరిశీలించిన పాపాన పోలేదని నిర్వాసితులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. సుంకేసుల నుంచి నిర్వాసితులను బలవంతంగా తరలించడంలో ఉన్న శ్రద్ధ వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో లేదా అని ప్రశ్నించారు. మూడు రోజుల్లో పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించి, అర్హులైన నిర్వాసితులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయని పక్షంలో నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తాటిపర్తి హెచ్చరించారు.


