చెట్టుకొకరు.. పుట్టకొకరుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల దుస్థితి
ఇళ్లు లేవు.. నీళ్లు లేవు.. రాత్రయినా రోడ్డుపైనే బతుకులు
నిర్వాసితుల గోడు పట్టని పాలకులు
నిన్నటి వరకు అదే వారి ప్రపంచం. తాతలు, ముత్తాతలు కట్టిన ఇళ్లు.. తరతరాలుగా సాగు చేసిన పొలాలు.. పశువులు.. పంటలు.. బంధాలు.. ఆత్మీయతలు.. అన్నీ అక్కడే. ఇప్పుడు ఆ ఊరు లేదు.. ఉన్నా మరికొద్ది రోజుల్లో నీట మునిగిపోనుంది. ‘మా ఊరు పోయింది.. ఇల్లు పోయింది.. ఇప్పుడు ఉండేందుకు చోటు కూడా లేకుండా పోయింది. ప్రాజెక్టుకు నీళ్లు వచ్చాయి.. మా జీవితాల్లో మాత్రం కన్నీళ్లే మిగిలాయి’ అంటూ వెలిగొండ నిర్వాసితులు వాపోతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన సుంకేసుల నిర్వాసితులు ప్రస్తుతం నిలువ నీడ కోసం నానా అవస్థలు పడుతున్నారు. నిర్వాసితుల కష్టాలపై గ్రౌండ్ రిపోర్టు...
మార్కాపురం:
వెలిగొండ ప్రాజెక్టు కోసం పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన 2,901 మంది సర్వం ధారపోశారు. నిర్వాసితుల పట్ల పాలకులు కనీస కనికరం చూపించలేదు. హడావిడిగా నీళ్లు విడుదల చేశారుగానీ.. వారి పునరావాసం గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్న భరోసాతో నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేశారు. కొందరు మార్కాపురం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో తలదాచుకోగా, మరికొందరు కలెక్టరేట్ సమీపంలోని పునరావాస కాలనీకి చేరుకున్నారు. కేటాయించిన స్థలాల్లో సామాన్లు వేసుకుని మూడు రోజులుగా అక్కడే ఉంటున్నారు. కానీ పునరావాస కేంద్రంలోనూ నిలువ నీడ కరువైంది. ’చెట్టుకొకరు.. పుట్టకొకరు’ అన్న చందంగా వారి పరిస్థితి మారింది.
ఊరు పోయింది.. గూడు ఏదీ?
స్వగ్రామంలోని ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి చేరుకున్న కుటుంబాలకు ఇక్కడ మరో పరీక్ష ఎదురైంది. కొత్త ఇళ్లు పూర్తికాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి సామాన్లు తెచ్చుకున్నా వాటిని పెట్టుకునేందుకు కూడా చోటు లేకుండా పోయింది. స్వగ్రామంలో ఉన్న గూడు పోయింది. కొత్తగా కట్టిస్తామన్న ఇల్లు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ‘ప్రాజెక్టు కోసం ఊరును వదిలాం.. కనీసం పునరావాసంలోనైనా ప్రశాంతంగా బతుకుదామనుకున్నాం. ఇక్కడ కూడా నిలువ నీడ లేకుండా పోయింది’ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రయితే రోడ్డే గూడు...
పగలు ఎలాగోలా గడిచినా.. రాత్రి వేళ పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఇళ్లు లేని కుటుంబాలు రోడ్డు పక్కన, ఖాళీ ప్రదేశాల్లో, చెట్ల కింద నిద్రించాల్సి వస్తోంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఆరుబయటే రాత్రులు గడుపుతున్నారు. దోమలు, పురుగులు.. విషసర్పాల భయం వెంటాడుతోంది. వర్షం వస్తే పరిస్థితి ఏమిటన్న ఆందోళన మరోవైపు. రాత్రయితే పిల్లలను ఎక్కడ పడుకోబెట్టాలో తెలియడం లేదు’ అంటూ మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
తాగునీటికీ తిప్పలే...
పునరావాస కేంద్రంలో కనీస తాగునీటి సదుపా యం కూడా సక్రమంగా లేకపోవడంతో నిర్వాసితు ల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. నీటి కోసం మహిళలు, పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఊరిని ఖాళీ చేయించి కొత్త ప్రాంతానికి తరలించినా కనీస వసతులు కల్పించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామాన్లు ఎక్కడ పెట్టాలి.?
ఇళ్లను ఖాళీ చేసే సమయంలో తమకు ఉన్న కొద్దిపాటి సామాన్లను కూడా నిర్వాసితులు వెంట తెచ్చుకున్నారు. కానీ.. పునరావాస కాలనీలో వాటిని భద్రపరిచేందుకు ఇళ్లు లేకపోవడంతో కొందరు వాటిని ఆరుబయటే ఉంచుతున్నారు. వర్షం వస్తే సామాన్లు తడిసి పాడవుతాయని ఆందోళన చెందుతున్నారు.
ఉపాధి పోయింది.. జీవితం ఎక్కడ.?
సుంకేసుల పునరావాస కేంద్రంలోదయనీయ పరిస్థితులు
ఊరు కోల్పోయి నిలువ నీడ కోసం వెతుకులాట
పునరావాసం అంటే ఇల్లు నిర్మించి ఇవ్వడం మాత్రమే కాదని నిర్వాసితులు అంటున్నారు. జీవనోపాధికి భరోసా కల్పించాల్సి ఉందని కోరుతున్నారు. స్వగ్రామంలో వ్యవసాయం, పశుపోషణ, కూలి పనులతో జీవించిన వారు ఇప్పుడు కొత్త ప్రాంతంలో ఉపాధి కోసం వెతుకులాట మొదలుపెట్టాల్సి వచ్చింది. పశువులు, ఎడ్లు, జీవాలను కూడా ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. కొందరు తాము ఉంటున్న చోటే కట్టెలు పాతి కట్టేస్తుండగా.. మరికొందరు కాలనీలోని వాటర్ ట్యాంకుల వద్ద కట్టేస్తున్నారు.


