ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం

ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ ఏదీ..? హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

రోడ్డుపైనే నివాసముంటున్న మండ్లా రామయ్య

సుంకేసుల పునరావాస కాలనీ

ఒంగోలు సిటీ: ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు, అనంతరం మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ క్యాడర్‌ను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా జిల్లాలో సుమారు 80 వేల నుంచి 85 వేల మంది కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందించనున్నట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో చాలా వరకు అమలు కాలేదని బూచేపల్లి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన ఆరోపించారు.

కూటమి నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యం: జూపూడి

రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, రైతుల సమస్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబు ధరల నియంత్రణపై దృష్టి పెట్టకుండా బహిరంగ సభలు, కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని జూపూడి పిలుపునిచ్చారు.

రామాయపట్నం పోర్టు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు : తూమాటి

ప్రకాశం జిల్లా అభివృద్ధి, ప్రజల ప్రయోజనాల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావు అన్నారు. జిల్లా వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా నాయకులంతా కలిసికట్టుగా పనిచేసిన చరిత్ర ప్రకాశం జిల్లాకు ఉందన్నారు. జిల్లా ప్రజల దశాబ్దాల కల రామాయపట్నం పోర్టు అని మాధవరావు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పోర్టుకు అనుమతులు తీసుకురావడంతో పాటు కోవిడ్‌, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా భూసేకరణ పూర్తి చేసి నిర్మాణాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో నిర్మించిన ప్రజా ఆస్తిని తక్కువ ధరకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పోర్టు ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. పోర్టు విషయంలో ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, అవసరమైన వేదికలపై ప్రజల తరఫున తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలను

వక్రీకరించొద్దు: ఎమ్మెల్యే తాటిపర్తి

వెలిగొండ ప్రాజెక్టును తామే పూర్తి చేశామని టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవడం సరికాదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. వెలిగొండ అంటే కేవలం రెండు టన్నెల్స్‌ పూర్తి చేయడం కాదని, 53 టీఎంసీల నల్లమలసాగర్‌, రెండు టన్నెల్స్‌, ఫీడర్‌ కాలువలు, కుడి–ఎడమ కాలువలు, తాగునీటి వసతులు తదితర నిర్మాణాలన్నీ కలిసిన సమగ్ర ప్రాజెక్టు అని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పునాది వేసి, అనుమతులు తీసుకొచ్చి, నిధులు కేటాయించి పనులను ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌తో పాటు మూడు డ్యామ్‌ల నిర్మాణం, ఫీడర్‌ కాలువ పనులు, టన్నెల్‌ పనుల్లో గణనీయమైన పురోగతి ఆయన హయాంలోనే జరిగిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మిగిలిన టన్నెల్‌ పనులు పూర్తి చేశారని తెలిపారు. రెండు టన్నెల్స్‌ మొత్తం సుమారు 37 కిలోమీటర్ల పొడవు ఉంటే, వాటిలో అత్యధిక భాగం గత ప్రభుత్వాల హయాంలోనే పూర్తయిందని, మిగిలిన కొంత పనిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసి మొత్తం ప్రాజెక్టు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన తీగలేరు కాలువ పనులు, భూసేకరణ ఇంకా పూర్తి కాలేదని చంద్రశేఖర్‌ అన్నారు. ఈ కాలువ ద్వారా సుమారు 62 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీఓ నంబర్‌ 324 ద్వారా భూసేకరణకు రూ.110 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు భూసేకరణ పూర్తికాకపోవడం బాధాకరమన్నారు.

కాలువలు పూర్తి చేయకుండా నల్లమలసాగర్‌ నుంచి నీటిని విడుదల చేస్తే ఆ నీరు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు చేరే పరిస్థితి ఉండదని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. సుమారు 9 వేల కుటుంబాలు పునరావాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపా రు. సుంకేసుల గ్రామ నిర్వాసితులకు పునరావాసం, నివాస స్థలాల విషయంలో స్పష్టత లేదన్నారు. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసాన్ని వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు. వెలిగొండ ప్రాజెక్టులో నీటి విడుదలకు ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

నీటి విడుదలకు ముందు కాలువలు, పరిసర ప్రాంతాల్లో హెచ్చరికలు, భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. కలెక్టర్‌, ఇరిగేషనన్‌ మంత్రి తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణయాదవ్‌, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్‌సీపీ నాయకులు పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వెన్నా హనుమారెడ్డి, దామరాజు క్రాంతికుమార్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement