మార్కాపురం: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పాత 13 జిల్లాల పరిషత్‌ల స్థానంలో 28 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు 13 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, 13 డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో పాటు పలు పోస్టులను కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
● పొగాకు బోర్డు ఆర్‌ఎం ప్రసాద్
ఒంగోలు సబర్బన్: స్వల్ప పెనాల్టీతో అధిక అనధికార పొగాకు అమ్మకంపై కొన్ని సిఫార్సులు చేసినట్లు ఒంగోలుకు చెందిన దక్షిణ ప్రాంత పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఆర్‌ఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పొగాకు అమ్మకాలపై వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌బీఎస్, ఎస్‌ఎల్‌ఎస్ ప్రాంతాల పరిధిలో పొగాకు వేలం, అమ్మకాల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పొగాకు బోర్డు ఆథరైజేషన్ ఇచ్చింది కేవలం 89 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి మాత్రమేనన్నారు. ఇప్పటి వరకు మొత్తం 129 పొగాకు కొనుగోలు రోజుల్లో ఎస్‌బీఎస్ ప్రాంతంలో సుమారు 31.41 మిలియన్ కిలోలు, ఎస్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో సుమారు 32.24 మిలియన్ కిలోల పొగాకు అమ్మకాలు జరిగాయని చెప్పారు. రెండు ప్రాంతాలకు కలిపి 63.64 మిలియన్ కిలోల అధీకృత పొగాకు కోటా అమ్మకాలు జరిగాయన్నారు. ఇది కాకుండా రైతులు అదనంగా, అనాథరైజ్డ్‌గా మరో 96 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేశారన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు స్వల్పంగా అపరాధ రుసుం (పెనాల్టీ) విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాణిజ్య శాఖకు సిఫార్సు చేశామన్నారు. పొగాకు బోర్డులో రిజిస్టర్ అయిన రైతులు మాత్రమే పొగాకు పంట సాగు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక విస్తీర్ణంలో నాటడం, అధికంగా పండించడం చేయరాదన్నారు. కౌలు భూముల్లో పొగాకు సాగు లాభదాయకం కాదని, స్వంత భూములు, స్వంత పొగాకు బ్యారన్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వర్జీనియా పొగాకు సాగు చేయాలని సూచించారు.


