ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలి

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

ఒంగోలు సిటీ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అన్ని స్థానాల్లోనూ గట్టిగా పోటీ చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌, పంచాయతీ, మండల స్థాయి ఎన్నికలు ఏవైనాగానీ.. ఒక్క స్థానాన్ని కూడా వదులుకోకుండా అభ్యర్థులను బరిలోకి దించాలని నాయకులకు సూచించారు. పార్టీకి బలమైన కేడర్‌, కార్యకర్తల అండ ఉందని, ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గెలుపోటములు సహజమేనని, పార్టీ కోసం పోటీ చేసిన వారికి భవిష్యత్‌లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం...

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను ప్రతి గ్రామంలోనూ ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు బూచేపల్లి పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలులో విఫలమైన విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన కరపత్రాలు, బుక్‌లెట్లను కార్యకర్తలకు విస్తృతంగా పంపిణీ చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా కూడా ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తప్పకుండా పోటీ చేస్తోందని, కార్యకర్తలు సమష్టిగా కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగాలి :

జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు చెందిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో జగనన్న ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. జిల్లాను కూడా అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు జగనన్న కృషి చేశారని చెప్పారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేశారని అభినందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాబోయే అన్ని ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వైఎస్సార్‌ సీపీకి అండగా నిలవాలని కోరారు.

స్థానిక ఎన్నికలంటే ప్రీ ఫైనల్స్‌ :

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్‌గా భావించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మండల స్థాయి నాయకులు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని కోరారు. పార్టీ క్యాడర్‌ ఐక్యతను కాపాడుకోవాలని సూచించారు. ఎన్నికల రణరంగంలో వైఎస్సార్‌ సీపీ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి :

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావు

కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గౌరవం పెంచడంతో పాటు శాసనమండలి ప్రతిష్టను కాపాడేలా తన పదవీకాలంలో పనిచేస్తానని స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్‌గా సభ నిర్వహించే అవకాశం ఒకవైపు, సభ్యుడిగా జిల్లా సమస్యలను సభలో ప్రస్తావించే అవకాశం మరోవైపు తనకు ఉందన్నారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి :

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్‌ సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిట్టనిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. రాబోయే స్థానిక సంస్ధల ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాలని, ఆ దిశగా చైతన్యం తేవాలని కోరారు.

స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి :

పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

ఆదిమూలపు సురేష్‌

స్థానిక సంస్థల్లో ప్రజలకు మరింత ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌, మేయర్‌, కౌన్సిలర్‌ తదితర పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుంటారన్నారు.

పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కె.నాగార్జున మాట్లాడుతూ గ్రామస్థాఽయిలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుడితే.. చంద్రబాబు దాన్ని అనుసరిస్తున్నారన్నారు. కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌ మాట్లాడుతూ జగనన్న హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి వివరించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేయాలని కోరారు. అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలున్నా పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలి, చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించాలన్నారు.

సమావేశంలో పార్టీ దర్శి అసెంబ్లీ పరిశీలకుడు మాదాసి వెంకయ్య, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కసుకుర్తి ఆదెన్న, కర్నేటి ప్రసాద్‌, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, నాయకులు పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్‌, దామరాజు క్రాంతికుమార్‌, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవ్వాలి

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కార్యకర్తలకు అండగా ఉంటాం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement