పురపోరుకు రంగం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పురపోరుకు రంగం సిద్ధం

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కసరత్తు

ఒంగోలు సబర్బన్‌:

మ్మడి ప్రకాశం జిల్లాలో పురపోరుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. అందుకుగానూ ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పునర్విభజన జరిగిన వార్డులు, డివిజన్ల జాబితాలను శనివారం అధికారులు ప్రచురించారు. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీ కాలం ఈ ఏడాది మార్చితో పూర్తయింది. ఆ తర్వాత ఒంగోలు నగరపాలక సంస్థలోని డివిజన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని వార్డులకు పునర్విభజన కార్యక్రమం చేపట్టారు. అయితే అధికార టీడీపీ నాయకులు ఇష్టానుసారం డివిజన్లు, వార్డుల విభజన చేపట్టారంటూ వైఎస్సార్‌ సీపీకి చెందిన నేతలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పరిశీలించి డివిజన్లు, వార్డులను ప్రకటించి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించాలని సూచించింది. ఆ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి కూడా ప్రచురించారు.

నియమం 3 కింద విభజించాలని సూచన...

సహజ సరిహద్దులను సక్రమంగా పరిగణనలోకి తీసుకుని నియమం 3 కింద ప్రభుత్వం నోటిఫై చేసిన విధంగా కార్పొరేషన్‌ ప్రాంతాన్ని వార్డులుగా విభజించాలని సూచించారు. ఆ మేరకు సహజ సరిహద్దులు, భౌగోళిక లక్షణాలు, ఆ ప్రాంతం అవిచ్ఛిన్నతను సక్రమంగా పరిగణనలోకి తీసుకుని నియమం 3 కింద ప్రభుత్వం నోటిఫై చేసిన విధంగా కార్పొరేషన్‌ ప్రాంతంలో వార్డులుగా విభజించబడుతుంది. సహజ సరిహద్దులను నిర్ధారించడం సాధ్యం కాని చోట, సాధ్యమైనంత వరకు సర్వే నంబర్లు, టి.ఎస్‌.నంబర్లు, ముఖ్యమైన కూడళ్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. వార్డులలో జనాభాలో వ్యత్యాసం, సాధ్యమైనంత వరకు వార్డు సగటు జనాభాలో 10 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. వార్డు విభజన కార్పొరేషన్‌ భౌగోళిక సరిహద్దులో క్లాక్‌ వైజ్‌గా ఈశాన్య బిందువు నుంచి ప్రారంభం కావాలి. వార్డులకు ఈశాన్య బిందువు నుంచి సవ్యదిశలో వరుస క్రమంలో సంఖ్యలు ఇవ్వాలి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ను వార్డులుగా విభజించడం, పునర్విభజించడం అనే ప్రతిపాదనకు సంబంధించి కమిషనర్‌ ఒక ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి దానిని కార్పొరేషన్‌ నోటీసు బోర్డుపై, ఇతర ప్రముఖ ప్రదేశాలపై, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురించాలి. నోటీసు ప్రచురించిన తేదీ నుంచి 7 రోజుల్లోపు మున్సిపల్‌ కార్యాలయానికి చేరేలా సాధారణ ప్రజల నుంచి సూచనలు కోరాలి. కమిషనర్‌ సదరు నోటీసును మున్సిపల్‌ కౌన్సిల్‌ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల కోసం వారి ముందు కూడా ఉంచాలి. నిర్ణీత కాలంలో అందిన అన్ని సూచనలు, అభ్యంతరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ను వార్డులుగా విభజించే ప్రతిపాదనపై ప్రజల నుంచి సూచనలు కోరుతూ కార్పొరేషన్‌ నోటీసు బోర్డు, ఇతర ప్రముఖ ప్రదేశాలలో ఫారం–1లో ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రచురణను ఈ నెల 5వ తేదీ ప్రకటించారు. వారం రోజుల్లో అంటే ఈ నెల 11వ తేదీలోపు ప్రజలు వాళ్ల అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఆయా మున్సిపల్‌ కార్యాలయాల్లో సమర్పించాలి. అనంతరం ఈ నెల 12వ తేదీ ఆ అభ్యంతరాలను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌, డైరెక్టర్‌కు కమిషనర్లు పంపుతారు. నిర్ణీత గడువులోగా ఎటువంటి సూచనలు తెలియజేయకుంటే అప్పటికే చేసిన ప్రతిపాదనలను ఖాయం చేస్తామని ఆ ప్రచురణలో పేర్కొన్నారు.

నగర పంచాయతీల్లోనూ ముమ్మరంగా ఏర్పాట్లు

హైకోర్టు ఆదేశాల మేరకు వార్డులు, డివిజన్ల ప్రచురణ

అభ్యంతరాలుంటే వారం రోజుల్లో

తెలియజేయాలని సూచన

కోర్టుల్లో కేసులున్న మున్సిపాలిటీలివే...

కందుకూరు మున్సిపాలిటీకి సంబంధించి హైకోర్టులో వివాదం కొనసాగుతోంది. 2012 నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. వార్డుల విభజనతో పాటు కొన్ని గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 8వ తేదీ వాయిదా ఉంది. అదేవిధంగా పొదిలి నగర పంచాయతీ 2021లో ఏర్పడగా, కంభాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలను విలీనం చేయవద్దని ఆయా గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో మొదట ఏర్పాటు చేసిన 20 వార్డులతోనే పాదిలి నగర పంచాయతీలో పాలన కొనసాగుతోంది. ఒంగోలు నగరపాలక సంస్థలో గతంలో 50 డివిజన్లు ఉండేవి. పునర్విభజన తర్వాత వాటిని 62కు పెంచారు. ఒంగోలు నగరపాలక సంస్థలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 6 డివిజన్లు కూడా కలగలిసి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement