● ఇద్దరికి
తీవ్రగాయాలు
టంగుటూరు: నిద్రమత్తు కారణంగా ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానిక జూనో బేకరీ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..టంగుటూరు ఫ్లైఓవర్ మీద ఒంగోలు నుంచి కందుకూరు వెళ్తున్న కారు..ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. కారు లారీని బలంగా ఢీకొని డివైడర్ దాటి సింగరాయకొండ నుంచి ఒంగోలు వైపు రోడ్డు మీదకు వచ్చి ఆగింది. ప్రమాదంలో కారు నడుపుతున్న రూపేష్‌కు బలమైన రక్త గాయమైంది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు, టంగుటూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తొలుత ఒంగోలు రిమ్స్‌కు, అక్కడి నుంచి బంధువులు మెరుగైన వైద్యం కోసం సంఘమిత్ర హాస్పిటల్‌కు తరలించారు. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ కోన్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఎస్సై ఫణిభూషణ్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అర్ధవీడు: మండల పరిధిలోని చీమలేటిపల్లెలో శనివారం సాయంత్రం ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. అందిన వివరాల ప్రకారం.. స్కూల్ బస్సు కంభం నుంచి విద్యార్థులతో అచ్చంపేట వరకు వచ్చి విద్యార్థులను గమ్యస్థానానికి చేర్చి తిరుగు ప్రయాణంలో చీమలేటిపల్లెలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న యర్రా భానుప్రకాష్ (30)ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య అంజలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


