పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో శనివారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతైన పెద్దదోర్నాల మండలంలోని కటకానిపల్లెకు చెందిన యువకులు రాజ్‌కుమార్, వినయ్‌కుమార్‌ల కుటుంబాలను యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే కటకానిపల్లె చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. సోమవారం పెళ్లిపీటలెక్కనున్న రాజ్‌కుమార్‌తో పాటు అతనికి వరుసకు సోదరుడైన వినయ్‌కుమార్ గల్లంతవడం తీవ్ర విచారకరమని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ పెద్దదోర్నాల మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి, నాయకులు ఉన్నారు.


