ఉప్పు సాగు చప్పగా..! | - | Sakshi
Sakshi News home page

ఉప్పు సాగు చప్పగా..!

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

దళారులదే రాజ్యం...

దళారులదే రాజ్యం...

సింగరాయకొండ:

కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు ఎల్‌నినో ప్రభావం తోడవడంతో ఈ సంవత్సరం ఉప్పు రైతు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఈ ఏడాది ఉప్పు ఉత్పత్తి బాగా పెరిగింది. కానీ, ఉత్పత్తికి తగిన డిమాండ్‌ లేకపోవడంతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ధరలు పూర్తిగా దిగజారాయి. చివరకు ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దీనికితోడు వ్యాపారులు సిండికేటై లాభాల కోసం పాకులాడుతూ రైతులను మోసం చేసి నష్టాలకు గురిచేస్తున్నారు. ఇతర ప్రాంతాల వ్యాపారులు రాకుండా అడ్డుకుంటూ తాము నిర్ణయించిందే ధర అంటూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. 60 కేజీల ఉప్పు బస్తా ధర కనీసం రూ.220 పలికితేనే రైతుకు గిట్టుబాటయ్యే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం రూ.70 మాత్రమే పలుకుతోంది. గత సంవత్సరం 75 కేజీల బస్తా ధర రూ.300 పలికింది. ఈ ఏడాది దారుణంగా పడిపోయినా కూటమి ప్రభుత్వ పెద్దలు కనీసం పట్టించుకోకపోవడంతో ఉప్పు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

పాతాళానికి పడిపోయిన ధరలు...

ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురవకపోవటంతో ఉప్పు ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పటికీ ధరలు పాతాళానికి పడిపోయాయి. దానికితోడు కూటమి ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఉప్పు రైతు నడ్డి విరిగే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనపర్తి, చిన్నగంజాం, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. 7 వేల మందికిపైగా రైతులు, 10 వేల మందికిపైగా కూలీలు ఉప్పు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. సింగరాయకొండ, చిన్నగంజాం నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఉప్పు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం మినహా సుమారు 9 నెలల పాటు ఉప్పు సాగవుతోంది. ఎకరాకు 75 కేజీల ఉప్పు బస్తాలు 1,000 వరకు ఉత్పత్తి అవుతాయి. దాని ప్రకారం ప్రతి నెలా 25 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి వస్తోంది. గత సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి లక్ష్యానికన్నా తక్కువగా వచ్చింది. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి అధికంగా ఉండటంతో ఎగుమతులు బాగా జరిగి లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ, ధరలు భారీగా పడిపోయి రైతులకు నిరాశే మిగిలింది.

గత ఫిబ్రవరిలో రూ.200.. ప్రస్తుతం రూ.70..!

జిల్లాలో సాగవుతున్న ఉప్పు ధరలు రోజురోజుకూ పడిపోతుండటంతో సాగుచేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గత ఫిబ్రవరి నెలలో తయారైన ఉప్పు 75 కేజీల బస్తా ధర నాణ్యతను బట్టి రూ.160 నుంచి రూ.200 పలికింది. జూలై నెలలో పండించిన ఉప్పు ధర 75 కేజీల బస్తా రూ.100 మాత్రమే ఉంది. ప్రస్తుతం 60 కేజీల బస్తా ధర కేవలం రూ.70 పలుకుతోంది. ఇటీవల యుద్ధం కారణంగా హోటళ్లు, క్యాటరింగ్‌ సర్వీసులు మూతపడే పరిస్థితి రావడంతో పడిపోయిన ధరలు తిరిగి పుంజుకునే దశలో ఎల్‌నినో ప్రభావంతో ఉప్పు ఉత్పత్తి మరింత పెరిగి ధరలు భారీగా పతనమయ్యాయి. ఎకరాకు వారానికి రూ.2 వేలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తయారైన ఉత్పత్తి కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయని, కాని ఉప్పు ఉత్పత్తి ఆపలేక మానసికంగా వేదన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పు ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో దళారులు రాజ్యమేలుతున్నారు. వీరు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి నెలకొంది. సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం, బింగినపల్లి ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 5 నుంచి 7 లారీల వరకు ఉప్పు రవాణా అవుతోంది. ఉప్పు ఉత్పత్తి గణనీయంగా పెరగటంతో సాగుపై ఆధారపడే కార్మికులు లబ్ధిపొందుతుండగా, రైతులు మాత్రం ధరలు పడిపోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చివరికి కౌలు కూడా కట్టలేని దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వంలో పండించిన ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, చివరకు ఉప్పు పంటకు కూడా ధరలు పడిపోయాయని, ప్రభుత్వం ఉప్పు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని ఉప్పు రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement