మర్రిపూడి: పాముకాటుకు ఓ మహిళా కూలీ మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన మర్రిపూడిలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని మూలే పేరయ్య భార్య వెంకట లక్ష్మమ్మ (62) వరి నారు పీకేందుకు కూలీలతో కలిసి మర్రిపూడి పంచాయతీ పరిధిలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామం వెళ్లింది. నారుమడిలోకి దిగి నారు పీకుతోంది. ఆ సమయంలో బురదలో పామున్న విషయాన్ని గుర్తించని వెంకటలక్ష్మి కుడిచేతిపై పాము కాటు వేసింది. ఆమెను తోటి కూలీలు మర్రిపూడి తీసుకొచ్చారు. అప్పటికే పాము విషం శరీరం మొత్తం వ్యాపించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. నాటు వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాటు వేసింది కట్ల పాముగా స్థానికులు భావిస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బేస్తవారిపేట: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై గురువారం అర్ధరాత్రి జరిగింది. 35 నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు 5.3 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు, ఎడమ భుజం, ఎడమ ఛాతిపై పుట్టు మచ్చలతో కాఫీ కలర్ నిండు చేతుల చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బేస్తవారిపేట పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై ఎస్.రవీంద్రారెడ్డి కోరారు.
అర్ధవీడు: పెద్ద పులి దాడి చేయడంతో గేదె మృతిచెందిన సంఘటన అర్ధవీడు మండల పరిధిలోని బొల్లుపల్లి ఫారెస్ట్ బీటులో అల్లురేణికుంట సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. బొల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ బాషుకు చెందిన గేదె గత శనివారం మేతకు వెళ్లి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు గాలించారు. అల్లురేణికుంటలో గేదె కళేబరం కనిపించడంతో పాటు పెద్ద పులి దాడి చేసి చంపిన ఆనవాళ్లున్నట్లు స్థానికులు గుర్తించారు. సుమారు రూ.లక్షకుపైగా విలువైన గేదె మృతిచెందడంతో భాషు కన్నీరుమున్నీరయ్యాడు. జీవనోపాధికి ఆధారమైన గేదెను కోల్పోయిన తనకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు.
అద్దంకి: ప్రకాశం జిల్లా సాఫ్ట్‌బాల్ డిస్ట్రిక్ట్ స్టీల్ సెలక్షన్స్‌కు సంబంధించి, పురుషుల, మహిళా సబ్ జూనియర్, జూనియర్ జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమం పట్టణంలో నిర్వహించారు. రెండు విభాగాల్లో పురుషుల జట్టులో 16 మందిని, సీ్త్రల జట్టులో 16 మందిని ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమం రాష్ట్ర అడహక్ త్రీమెన్ కమిటీ అధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న జట్లు రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్, జూనియర్స్ విభాగాల్లో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఆడనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ అబ్జర్వర్ నరసింహ, నెల్లూరు మహేశ్, వాసు, విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పీడీ పీ తిరుపతి స్వామి పర్యవేక్షించారు.


