ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి మూడు సిలిండర్ల ముచ్చట చెప్పొద్దు సార్‌

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

కొండపి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొండపి మండలంలో కొండపి నుంచి టంగుటూరు వెళ్లే మార్గంలో రంగసాయి వాగు సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై టీ త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సంతనూతలపాడు మండలం మద్దులూరుకు చెందిన ఎస్‌.రవి (20), మనోహర్‌, వెంకటరావు ద్విచక్ర వాహనంపై మద్దులూరు నుంచి మిట్టపాలెంలో వివాహానికి బయలుదేరారు. వ్యక్తిగత పనులు ఉండటంతో మిట్టపాలెం నుంచి కొండపి వచ్చి పనులు ముగించుకుని మిట్టపాలెంలో వివాహానికి వెళ్తున్న సమయంలో అతివేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మనోహర్‌, వెంకటరావును 108లో కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలులోని జీజీహెచ్‌కి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై త్యాగరాజుతో కలిసి సీఐ వైవీ రమణయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఖాళీ వంట గ్యాస్‌ సిలిండర్లతో ఐద్వా నిరసన

ఒంగోలు టౌన్‌: ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అరకొరగా అమలు చేస్తూ మహిళలను దగా చేస్తోందని ఐద్వా మహిళా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. ఎవరెవరికి ఎన్నెన్ని సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం స్థానిక చైతన్య నగర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ వంట గ్యాస్‌ సిలిండర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ చౌకదుకాణాలలో బియ్యంతో పాటుగా కందిపప్పు, నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పిన హామీని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. పెరుగుతున్న ధరలతో నిరుపేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిందని, అన్నీ చేసేశామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐద్వా నగర కార్యదర్శి జి.ఆదిలక్ష్మి, ఐద్వా నాయకులు ఎస్‌.అనిత, డి.తిరుపతమ్మ, ఎం.సుబ్బరత్తమ్మ, గురవమ్మ, నాగమణి, శిరీష, శ్రావణి, ఆర్‌.సుబ్బులు, డి.వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement