గుడ్లూరు: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే పల్లె నిద్ర చేస్తున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. గుడ్లూరు మండలంలోని చెమిడిదపాడు గ్రామంలో గురువారం రాత్రి పల్లె నిద్ర చేసిన కలెక్టర్.. స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా అర్జీలలో పేర్కొన్న సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం గ్రామంలో విస్తృతంగా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అదేవిధంగా జగనన్న కాలనీలో నీటి సమస్య పరిష్కరించేందుకు పైపులు ఏర్పాటు చేస్తామన్నారు. మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతోందో..లేదో పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల తరగతి గదులను పూర్తి చేసేందుకు చర్యలు తీనుకుంటామని చెప్పారు. తొలుత సచివాలయం వద్ద ఉన్న జగనన్న కాలనీలో తాగునీటి సమస్య గురించి కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట కాలువను, మంచినీటి సరఫరాను పరిశీలించారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నారా..లేదా..? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులపై కూలీలను ఆరా తీశారు. కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాల అధికారి వెంకటేశ్వరరావు, డీపీవో అనుపమ, డ్వామా పీడీ జోసఫ్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ చంద్రశేఖర్, 44 శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజాబాబు


