ఒంగోలు టౌన్: జిల్లా అభివృద్ధిలో భాగంగా ఒంగోలు నగరంలో మెడికల్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. నగరంలోని వివిధ స్పెషాలిటీ సేవలందిస్తున్న ఆస్పత్రులన్నీ ఒకచోట ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో శుక్రవారం ప్రైవేటు వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెలలో 150 మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని వైద్యులు ఒంగోలు నగర విశిష్ట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. మెడికల్ క్యాంపుల నిర్వాహణకు సంసిద్ధం కావాలని, సేవలను మరింత విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, పీడీసీపీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కె.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.


