వినూత్న ఆలోచనలతో భావితరాలను తీర్చిదిద్దుతున్న గురువులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న టీచర్లు ఉత్తమ సేవకులకు రాష్ట్ర, జిల్లా స్థాయి పురస్కారాలు
బేస్తవారిపేట: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి భవితకు మార్గదర్శకునిగా నిలుస్తున్నారు మద్దుల వెంకటేశ్వరరెడ్డి. బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు మెయిన్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా ఆయన మార్కాపురం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపే వెంకటేశ్వరరెడ్డి తాను పనిచేసిన పాఠశాలల్లో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పలకలు, కాపీ రాత పుస్తకాలు సొంత నిధులతో అందించారు. నవోదయ, గురుకుల పాఠశాలల అర్హత పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందిస్తూ పలువురి ఉన్నత విద్యకు మార్గదర్శకంగా నిలిచారు. విద్యారంగంతో పాటు సామాజిక సేవలోనూ వెంకటేశ్వరరెడ్డి తనదైన ముద్ర వేశారు. 12 ఏళ్లగా చేయూత మిత్రమండలిలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మిత్రులు శివ, నబిల సహకారంతో త్రీ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిల్లో పలు టాలెంట్ పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.
మార్కాపురం రూరల్: విద్యాబోధనే కాదు..విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మార్కాపురం మండలం బోడపాడు ఎంపీపీ స్కూల్ ఎస్‌జీటీ పి.శ్రీనివాసులు. అంకిత భావంతో ఆయన అందించిన సేవలు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యేలా చేశాయి. శ్రీనివాసులు గతంలో ఆర్మీలో సేవలందించి రిటైర్డ్ అయ్యారు. అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావాన్ని ఉపాధ్యాయ వృత్తిలోనూ కొనసాగించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీనివాసులు బోడపాడు పాఠశాలలో చేరిన సమయంలో కేవలం 30 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. రెండేళ్లలో ఆయనతోపాటు ఇతర ఉపాధ్యాయుల కృషితో పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది. దీంతో 2026 నాటికి విద్యార్థుల సంఖ్య 170కు చేరింది. ప్రస్తుతం పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులతో ఉన్న పాఠశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరే స్థాయికి తీసుకురావడంలో శ్రీనివాసులు కీలక పాత్ర పోషించారని గ్రామస్థులు చెబుతున్నారు. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.15 లక్షల మేర అభివృద్ధి పనులు జరిగాయి. ఇందులో శ్రీనివాసులు తన సొంత డబ్బుతో సుమారు రూ.5 లక్షలు వెచ్చించి పాఠశాల అభివృద్ధికి సహకరించినట్లు స్థానికులు తెలిపారు. చిన్న పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన మార్గదర్శకత్వంలో గత రెండేళ్లలో ఆరుగురు విద్యార్థులు నవోదయలో సీట్లు సాధించడం విశేషం.ఒకప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న బోడపాడు ఎంపీపీ పాఠశాలలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒంగోలు సిటీ: చదువు అంటే పుస్తకాల్లోని పాఠాలను బట్టీ పట్టడం కాదు.. నేర్చుకున్న విషయాన్ని ప్రయోగించి చూడటం.. ప్రశ్నించడం.. కొత్తగా ఆలోచించడం. ఇదే సూత్రాన్ని నమ్మి ఉపాధ్యాయ వృత్తికి కొత్త నిర్వచనం చెబుతున్నారు కాకి స్వర్ణలత. ముండ్లమూరు మండలం వేముల జెడ్పీ హైస్కూల్‌లో సైన్స్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె సైన్స్ పాఠాలను ప్రయోగాలతో ఆసక్తికరంగా మార్చడమే కాకుండా.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్తున్నారు. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వ్యక్తిగతంగా చేయూతనిస్తూ.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 2009 నుంచి సైన్స్ ప్రాజెక్టులు, ప్రయోగాల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ (ఎన్.సీ.ఎస్.సీ) ఇన్‌స్పైర్, సైన్స్ ఫెయిర్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఏపీ సైన్స్ కాంగ్రెస్ తదితర వేదికల్లో విద్యార్థుల ప్రాజెక్టులు ప్రదర్శించేలా మార్గనిర్దేశం చేశారు. ఆమె పర్యవేక్షణలో రూపొందించిన విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో గుర్తింపు పొందాయి. జాతీయ స్థాయిలో నాలుగు, సదరన్ ఇండియా స్థాయిలో 12, రాష్ట్ర స్థాయిలో 27 ప్రాజెక్టులకు అవకాశాలు లభించడంతో పాటు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. వేముల జెడ్పీ హైస్కూల్‌లో పనిచేసేటప్పుడు సుమారు రూ.లక్ష వ్యయంతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడంలో స్వర్ణలత కీలకంగా వ్యవహరించారు. పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, దుస్తులు వంటి విద్యా సంబంధిత సామగ్రిని, ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. విద్యా సామగ్రి రూపకల్పనలోనూ భాగస్వామ్యమయ్యారు. 8, 9, 10 తరగతుల మాడ్యూల్ రచన, అనువాద కార్యక్రమాలు, ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పీఎస్ పాఠ్యపుస్తక రచనలో భాగస్వామ్యం, రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్, ఎస్‌ఆర్‌పీగా బాధ్యతలు నిర్వహించారు. నేషనల్ గ్రీన్ క్రాప్స్ క్లస్టర్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. కాకి స్వర్ణలత సేవలకు పలు అవార్డులు వరించాయి. 2019లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2022లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. 2018 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘భారత మహిళా శిరోమణి’ అవార్డును అందుకున్నారు. 2019 లో ఎన్టీఆర్ అవార్డును అందుకున్నారు. 2022 సంవత్సరంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో ‘డైమండ్ జూబ్లీ అవార్డు’ కూడా అందుకున్నారు.
జరుగుమల్లి(సింగరాయకొండ): విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి ఉన్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు జరుగుమల్లి మండలం పచ్చవ హైస్కూల్ హెచ్‌ఎం బాపిరెడ్డి ఇందిర. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న ఆమె విద్యార్థులతో పాటు పాఠశాల అభివృద్ధికీ కృషి చేస్తున్నారు. ఉలవపాడు, మైనంపాడు, చీమకుర్తి, కనిగిరి పాఠశాలల్లో పనిచేశారు. 2024–25 లో ట్రిపుల్ ఐటీలో 4 సీట్లు, 2025–26లో త్రిపుల్ ఐటీలో 3 సీట్లు విద్యార్థులు సాధించారు. అలాగే జిల్లా సైన్స్ ఫెయిర్‌లో ఇన్‌స్పైర్ మానక్ అవార్డు సాధించి రూ.10 వేలు ప్రైజ్ మనీ, కలెక్టర్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు తో పాటు రూ.20 వేలు ప్రైజ్‌మనీ అందుకున్నారు. దాతల సహకారంతో పచ్చవ పాఠశాలలో కళా ప్రాంగణం నిర్మించారు. పాఠశాల పూర్వవిద్యార్థులతో పాఠశాలలో అభివృద్ధి పనులకు కృషి చేశారు.
మేడమ్ స్ఫూర్తితో ట్రిపుల్ ఐటీ సీటు సాధించా
నేను పచ్చవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాను. నా తల్లిదండ్రులు బేల్దారి కూలీ పనులు చేస్తుంటారు. నాకు మొదటి నుంచి సరైన గైడ్‌లైన్స్ లేదు. కానీ ప్రధానోపాధ్యాయురాలు బాపిరెడ్డి ఇందిర మేడమ్ నాలోని ప్రతిభను గుర్తించి గత డిసెంబర్ నెలలో నేను క్లాస్ రూమ్ లో ఉండగా నా ఫొటో తీసి ఈ ఫొటో ఫ్లెక్సీలో రావాలి అంటూ నాలో బాగా చదువుకోవాలి అన్న పట్టుదలను, ట్రిపుల్ ఐటీ సీటు సాధించాలన్న స్ఫూర్తిని నింపారు. ఆ స్ఫూర్తితో పదో తరగతిలో 579 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీటు సాధించాను. నేను ఇందిర మేడమ్‌కు నా జీవితాంతం రుణపడి ఉంటాను.
– వీ అలేఖ్య, విద్యార్థిని
సంతమాగులూరు(అద్దంకి): జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై న ఏల్చూరు పాఠశాల ఉపాధ్యాయుడు ఎం హనుమంతరావు తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో నాడు–నేడులో పాఠశాలలను అభివృద్ధి చేయించారు. 1996లో ఎస్‌జీటీగా బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం పాఠశాలలో ఉద్యోగంలో చేరిన ఆయన సంతమాగులూరు మండలంలోని మిన్నెకల్లు యూపీలో పదేళ్లు పనిచేసిన సమయంలో ప్రధానోపాధ్యాయునిగా యూపీ పాఠశాలను హైస్కూల్‌గా మార్చేందుకు కృషిచేశారు. అదే విధంగా బోధించే తెలుగులో 9 మందికి నూటికి నూరు మార్కులు సాధించేలా చేశారు. ఎనభై శాతం మంది విద్యార్థులకు సగటున 80 మార్కులు వచ్చేలా విద్యను బోధించారు. సంతమాగులూరు పాఠశాలను స్థానిక పెద్దల సహకారంతో ప్రహరీ, మూడు భవనాలు కట్టించారు. ఏల్చూరు ముస్లిం పాఠశాలలో మూడు భవనాలు మంజూరు చేయించి యూపీ నుంచి హైస్కూల్ చేయించారు.
డ్రాయింగ్‌లో
తర్పీదునిచ్చారు..
మా మాస్టారు తెలుగు సబ్జెక్టులోనే కాకుండా మాకు చిత్ర లేఖనంలోనూ తర్ఫీదునిస్తుంటారు. నాకు పోటీల్లో మంచి ప్రైవ్ వచ్చింది.
– నూకల విద్యావైష్టవి, తొమ్మిదో తరగతి


